Saturday, November 23, 2024

Andhra Pradesh | అయ్యో పాపం, మూర్ఛతో చ‌నిపోయిన‌ తల్లి.. ముళ్ల పొదల్లో ప‌సికందు

తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదతీరాల్సిన రెండు రోజుల పసికందు ముళ్ల పొదల్లోకి క‌నిపించింది. అయితే.. ఆ చిన్నారి త‌ల్లి మూర్ఛ వ్యాధితో చ‌నిపోగా, ఆ ప‌సిపాప‌ను తండ్రి ప‌ట్టించుకోకుండా ముళ్ల‌పొదల్లో విసిరేసినట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఎన్‌టీఆర్ జిల్లాలో జ‌రిగింది. ఇది చూసిన జ‌నం ఆ తండ్రి క‌ర్క‌శ‌త్వాన్ని తిట్టిపోస్తున్నారు. ప‌సికందుకు ప‌ట్టిన గ‌తిని చూసి అయ్యో పాపం అంటూ క‌న్నీరుపెడుతున్నారు.

– ప్రభ న్యూస్, ఇబ్రహీంపట్నం

ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండల పరిధిలోని (కాచవరం) దొనబండ వద్ద ఓ ప‌సికందు ముళ్ల పొద‌ల్లో క‌నిపించింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవత్వం మరిచిన కన్న తండ్రే కర్కశంగా దారుణానికి ఒడి కట్టడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మహమ్మద్ షాబాజ్ గుడివాడకు చెందిన దివ్య అనే యువతితో కొంతకాలంగా హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో దివ్య గర్భవతి కాగా ఈనెల 23వ తేదీన పురిటి నొప్పులు రావడంతో హైదరాబాద్ లోని మోడరన్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ దివ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే దివ్యకు మూర్ఛ రావడంతో ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు రాత్రి 8 గంటల సమయంలో దివ్య మృతి చెందింది.

దివ్య మృతదేహాన్ని తీసుకుని మినీ అంబులెన్స్ లో హైదరాబాద్ నుంచి ఆమె స్వగ్రామం గుడివాడకు వస్తుండగా మార్గమధ్యలోని దొనబండ వద్ద ముళ్లపొదల్లో షాబాజ్ వారి పసికందును వదిలి వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న గాజులు విక్రయించే మహిళ పసికందు ఏడుపు విని ద‌గ్గ‌రికి వెళ్లి చూసింది. పొదల్లో పసికందును గుర్తించి వెంటనే స్థానిక ఆశ వర్కర్ కు అప్పగించింది. స్థానిక వీఆర్వో, ఆశ వర్కర్లు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. ఇక‌.. సీఐ పి.శ్రీను, ఎస్సై శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దారుణానికి పాల్పడ్డ పసికందు తండ్రి షాబాజ్ ను పట్టుకున్నారు. పసికందును సంరక్షణ నిమిత్తం చైల్డ్ లైన్ కు అప్పగించారు. పసికందును ముళ్లపొదల్లో వదిలేసి పారిపోతున్న దౌర్భాగ్యపు తండ్రిని శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement