విశాఖపట్టణం, : విశాఖ డెయిరీ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఇటీవల నియమించిన సభా సంఘం సోమవారం తొలిసారి విశాఖపట్టణంలో పర్యటించింది.
సభా సంఘం ఛైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన), దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)లు ముందుగా విశాఖ డెయిరీ ఛైర్మన్ ఛాంబర్లో ఆ సంస్థ ఎండీ ఎస్.వి. రమణ, పలువురు డైరెక్టర్లతో భేటీ అయ్యారు.
వివిధ అంశాలపై ఆరా తీశారు. సొసైటీగా ఉన్న సంస్థ మాక్స్(మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ)గా తర్వాత కంపెనీగా ఎలా మారిందనే కోణంలో పూర్తి సమావేశం జరగ్గా ఆ సంస్థ ఎండీను విచారించారు. పలు అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ట్రస్టులు ఎన్ని పెట్టారు. వాటిని ఎలా నిర్వహిస్తున్నారు. వాటికి ఆదాయం ఎలా వస్తుంది అనే కోణంలో పలు ప్రశ్నలు సంధించారు. ఆసుపత్రి నిర్వహణ ప్రక్రియ ఎలా ఉంది. రైతులకు ఎన్ని బెడ్లు కేటాయించారు. వారి చికిత్సకు అందించే సాయం ఎంత మొత్తం ఉంటుంది. రైతులకు భీమా, బోనస్ చెల్లింపులు ఎలా ఉంటున్నాయి అనే అంశాలపై ఆరా తీశారు.
ఉద్యోగుల నియామకం, జీత భత్యాలు, ప్రమోషన్లు తదితర అంశాలను సభ్యులు అడిగారు. పాల సేకరణ ధర, బయట మార్కెట్లో డెయిరీ ఉత్పత్తుల విక్రయ విధానం, టెండర్లు, కాంట్రాక్టు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విశాఖ డెయిరీ ప్లాంటును సభా సంఘం ఛైర్మన్, సభ్యులు సందర్శించారు.
అక్కడ పరిస్థితులను గమనించారు. పాల నుంచి ఉత్పత్తయ్యే వివిధ రకాల ప్రోడక్టులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడి సమావేశంలో చర్చించిన విషయాలను వెల్లడించారు. తర్వాత తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ విశాఖ డెయిరీ కాంట్రాక్లు కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారితో మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులతో సమావేశం
విశాఖ డెయిరీ సందర్శన అనంతరం సభా సంఘం స్థానిక కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సమక్షంలో వివిధ విభాగాల జిల్లా అధికారులతో భేటీ అయ్యింది. డెయిరీ నిర్వహణలో భాగస్వామ్యం కలిగిన ఆయా శాఖల అధికారులను సభ్యులు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సొసైటీ నుంచి కంపెనీ వరకు మారిన క్రమంలో డెయిరీ యాజమాన్యం అనుసరించిన నిబంధనలు, ఇప్పటి వరకు ఉన్న కోర్టు కేసులు, వాటి తాజా పరిస్థితి గురించి ఆరా తీశారు. భూములు, ట్రస్టులు, ఆసుపత్రి, ఐస్ క్రీం ప్లాంట్ల నిర్వహణ, డెయిరీ ఛైర్మన్ తాలూక బంధువులు, కుటుంబ సభ్యుల జోక్యంపై సమావేశానికి విచ్చేసిన ఎండీని ప్రశ్నించారు.
కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా.. వాటి తాజా పరిస్థితి ఎంటని అడగ్గా ఎండీ సరైన సమాధానం చెప్పకపోవటంతో కలెక్టర్ జోక్యం చేసుకొని డెయిరీ నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను, ఆడిట్ రిపోర్టులను, కోర్టు కేసుల వివరాలను సభా సంఘానికి సమర్పించాలని ఎండీని ఆదేశించారు.
సభా సంఘం పర్యటనలో, సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్, డిప్యూటీ సెక్రటరీ రాజ్ కుమార్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు సంగీత్ మాధుర్, ఎస్.డి.సి. జయరామ్, కోఆపరేటివ్ అధికారి ప్రవీణ, కార్మిక శాఖ ఉప కమిషనర్ సునీత ఇతర అధికారులు పాల్గొన్నారు.