Friday, November 22, 2024

AP: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఆగస్టు 23 : గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుగొమ్మలని, వాటి అభివృద్దే ధ్యేయంగా స్వర్ణ గ్రామసభల పేరుతో జిల్లాల్లో 912 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సదస్సులు నిర్వహించి ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రజలతో తీర్మానాలు చేయిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డ్రెయిన్ లేని, సిమెంట్ రోడ్డు లేని గ్రామాలను రెండేళ్ళలోనే తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామ పంచాయితీలో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రచ్చబండ వద్ద మాట్లాడారు. సానివాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల నిర్వహణతో స్థానిక సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఈ సభలు దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ… గ్రామ సమస్యలు నమోదు చేసుకోవాలని, ప్రజలు చెయ్యి చెయ్యి కలిపి గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి చేయాలన్నారు.

- Advertisement -

గ్రామ సర్పంచ్ రుప్ప లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వర రావు, డ్వామా పీడీ ఎన్.వి.చిట్టిరాజు, జెడ్పీ డిప్యూటీ సీఈవో ఆర్.వెంకట్రామన్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కే.శ్రీధర్, జడ్పీటీసీ రుప్ప దివ్య ఎంపీటీసీ రుప్ప అప్పలసూరి, తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement