Tuesday, November 26, 2024

విజయవాడ నుంచి సౌదీకి విమానలు నడపండి.. ప్రధానికి ఎంపీ కృష్ణదేవరాయలు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని విజయవాడ నుంచి విమానసర్వీసులు నడపాలని నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రధానిని కోరారు. ప్రధానికి లేఖ రాసిన ఆయన ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర జూలై నెలలో ప్రారంభమవుతున్నందున ఆంధ్రప్రదేశ్‌ నుంచి హజ్‌ యాత్రికులు సౌదీ అరేబియాకు చేరుకునేందుకు వీలుగా ఎంబార్కేషన్‌ పాయింట్‌ కలిగిన విజయవాడ విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు కల్పించాలని కోరారు. ముస్లింల పవిత్ర నగరమైన మక్కాకు చేరుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేరుగా విమానాలు లేకపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్‌ వెళ్లి అక్కణ్ణుంచి సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కోవిడ్‌-19 ఆంక్షలు, పరిమితుల అనంతరం జరుగుతున్న ఈ యాత్రకు దేశవ్యాప్తంగా 80,000 మంది వెళ్తుండగా, ఇందులో ఏపీ నుంచి 1,200 ఉన్నారని తెలిపారు.

అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్న విజయవాడకు 2022లో ఎంబార్కేషన్‌ పాయింట్‌ కూడా ఏర్పాటు చేశారని, వందే భారత్‌ మిషన్‌ కింద కోవిడ్‌-19లో ఇతర దేశాలకు విమానాలు ఇక్కడి నుంచి నడిపారని గుర్తుచేశారు. ప్రస్తుతం విజయవాడ నుండి మస్కట్, కువైట్, షార్జాలకు విమాన సర్వీసులు ఉన్నాయని, అలాగే సౌదీ అరేబియాకు కూడా విమాన సర్వీసులు కల్పించి హజ్‌ యాత్ర చేయనున్న ఆంధ్ర ముస్లింలకు ప్రయాణం సులభతరం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా దేశ ప్రధానితో పాటుగా, ముస్లిం మైనారిటీ వ్యవహారాల మంత్రికి, పౌర విమానయాన మంత్రికి విడివిడిగా లేఖలు రాశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement