అమరావతి, ఆంధ్రప్రభ : రాజకీయ నాయకులకు ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలు వర్తించవు సరే.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసులున్నాయి… ఛార్జిషీట్లూ ఉన్నాయి.. మరి ఆమెకు వర్తించని నిబంధనలు నాకెలా వర్తిస్తాయి? అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. తనపై వేటు వేయడం ఆర్టికల్ 14 కింద ఉన్న సమానత్వం అనే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుందని, ఇక మరోసారి కోర్టుకు వెళ్లి పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా విధుల్లో ఉన్న ఆయనపై ప్రభుత్వం వేటు వేయడం పట్ల ఏబి వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏబివిని సస్పెండ్ చేయగా రెండేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం ద్వారా సుప్రీం ఆదేశాల మేరకు తిరిగి పోస్టింగ్ తెచ్చుకోగా ఈనెల 15వ తేదీన విధుల్లో చేరారు. 15రోజులు గడవకుండానే మళ్ళీ ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది.
నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై గత మార్చిలో ఏసీబీ కేసు నమోదు చేసింది జగన్ సర్కార్. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటు-న్న ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగాలపై ప్రభుత్వం తాజాగా మరోసారి సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఏబి వెంకటేశ్వరరావు తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వం ఉత్తర్వుల కాపీలు తనకు అందలేదని స్పష్టం చేశారు. ఈసందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకే అంశంపై.. ఒక్కరిపై రెండు సార్లు చర్యలు తీసుకుంటారా అని అన్నారు. లీగల్‌గా ఇవేమీ చెల్లవని. తనపై ఇప్పటివరకు ఏ ఛార్జిషీటు దాఖలు చేయలేదని, ఏసీబీ కేసు ఉన్నమాట నిజమేనని చెప్పారు.
ఈ కేసులో అసలు విచారణ లేకుండా ఇక సాక్షులను ఏలా ప్రభావితం చేస్తాను.. ఒకసారి హైకోర్టు కొట్టేసినప్పుడు అదే సె క్షన్ కింద మళ్ళీ ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రతి అక్షరం, ప్రతి వాక్యం అబద్ధమని, నిరూపించేందుకు తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఒక రూపాయి కూడా అవినీతి జరగని చోట ఏసీబీ కేసు పెట్టడం ఏంటి? ఇజ్రాయెల్ కంపెనీ అని పదేపదే అంటున్నారు. అదేమైనా సూట్‌కేసు సంస్థా? ఈ విషయంలో ఎక్కడ కూడా మేం ఎవరికీ ఒక రూపాయి కూడా కమీషన్ ఇవ్వలేదని సంస్థ స్పష్టంగా చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. సిబిఐ, ఈడీ కేసుల్లో జగన్‌పైనా ఛార్జి షీట్లు ఉన్నాయని అయితే సర్వీస్ రూల్స్ విషయానికొస్తే ఐఎఎ స్ శ్రీలక్ష్మీపైనా ఛార్జి షీట్లు ఉన్నాయని మరి నింబంధనలు ఆమెకు వర్తించవా అని అన్నారు.
అయితే తనను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదని, కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు టార్గెట్ చేస్తున్నాయని, అందుకు కారణాలు చాలా ఉన్నాయన్నారు ఏబి వెంకటేశ్వరరావు. తాను ఇంటిలిజెన్స్ డీజీగా పని చేసిన సమయంలో కోడి కత్తి సంఘటనను అడ్డం పెట్టు-కొని రాష్ట్రాన్ని తగలబెట్టేందుకు చూశారని, అయితే కొన్ని గంటల్లోనే నిలువరించామన్నారు. అందుకే కొందరికి తనపై కోపమని, తనపై ఎన్నో ఫిర్యాదులు, పిటిషన్లు వేశారన్నారు. ఈ మూడేళ్లలో నేను తప్పు చేసినట్లు ఎక్కడా ఒక్క ఆధారం కూడా లేదని అన్నారు. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాన ని, మూడే్లళనా ఇంతవరకు నేను చేసిన తప్పేంటో చెప్పలేకపోయారని ఇక ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం తప్పదని ఏబీవీ వెల్లడించారు.
తనదైన శైలిలో సెటైర్..
అధికార పార్టీకి చెందిన ఓ శాసనసభ్యునిపై ఏబీ వెంకటేశ్వరరావు తనదైన శైలిలో సెటైర్ వేశారు. మీడియాలో కనిపించి కన్నీళ్లు పెట్టుకున్న సదరు ప్రజాప్రతినిధి ప్రభుత్వం ఏర్పడక ముందు తనకు ఫోన్ చేసి బెదిరింపు ధోరణితో మాట్లాడారన్నారు. రెండ్రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడతాయి అనగా నెల్లూరుకు చెందిన సదరు ఎమ్మెల్యే తనకు ఫోన్ చేశాడని గెలువబోతున్నాం నీ సంగతేంటో చూస్తామని అప్పట్లో బెదిరించాడన్నారు. అర్థరాత్ర ఏ పరిస్థితుల్లో, ఏ మూడ్‌లో ఉండి కాల్ చేశాడో అని విని ఊరుకున్నానని చెప్పారు. అదే ప్రజాప్రతినిధి తన సంగతి తేల్చలేకపోయాడుగానీ మంగళవారం రాత్రి ఓ మీడియా ముందుక బోరునా ఏడ్చినట్లు వార్తల్లో చదివానన్నారు. అలా ఉంటుంది జీవితమని ముక్తాయించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.