శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఇటీవల ఖరారు చేసిన డివిజన్ల రిజర్వేషన్ లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని దళిత సంఘాల జెఎసి నేతలు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ నివాస్ ను కోరారు. నగర పాలక సంస్థ డివిజన్ల రిజర్వేషన్ల ఖరారులో దళితులకి అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసారు. నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లు ఉండగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్.సి,ఎస్.టిలకి 14 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాల్సి ఉందని , దాని ప్రకారం ఎస్.సి,ఎస్.టిలకి కలిసి 7 డివిజన్లు కేటాయించాల్సి ఉందని తెలియజేసారు. అయితే నగర పాలక సంస్థ పరిధిలో తాజాగా ఖరారైన రిజర్వేషన్లలో ఎస్.సి,ఎస్.టిలకి 6 డివిజన్లను మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. దాని వల్ల ఒక డివిజన్ లో రిజర్వేషన్ ను ఎస్.సిలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు.
అలాగే డివిజన్లను రోటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉండగా దానిని కూడా పాటించకపోవడం వల్ల ఇతర డివిజన్లలో ఉన్న దళితులకు అవకాశం కోల్పోతున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్ట ప్రకారం రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లను 14 శాతం కార్పొరేటర్ల స్థానాలు దళితులకు కేటాయించాల్సి ఉందనిని సెక్షన్ 6 స్పష్టంగా చెబుతోందని విన్నవించారు.