Saturday, November 23, 2024

ఆర్టీసీకి కలిసొచ్చిన ‘సాధారణ’ నిర్ణయం.. కిటకిటలాడిన ప్రత్యేక సర్వీసులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీఎస్‌ ఆర్టీసీకి దసరా కలిసొచ్చింది. సాధారణ టిక్కెట్టు రేట్లకే ప్రత్యేక సర్వీసులతో ఆదాయం అనూహ్యంగా పెరిగింది. గత ఏడాదితో పోల్చితే దసరా(ప్రీ)కు రెట్టింపు ఆదాయం వచ్చింది. తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగలైన దసరా, సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీలు నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేక బస్సుల్లో రద్దీ ఒకవైపు మాత్రమే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు టిక్కెట్టు ఛార్జీపై అదనంగా మరో 50శాతం వసూలు చేస్తారు. ఇది సాధారణ సగటు ప్రేక్షకులకు కొంత ఆర్థిక భారమే అయినప్పటికీ తప్పనిసరి స్థితిలో వెళ్లక తప్పేది కాదు. గత ఏడాది దసరాకు ముందు 1020 ప్రత్యేక సర్వీసులు నడిపారు. 50శాతం అదనపు రేటుతో నడిపిన ఈ సర్వీసుల ద్వారా ఆర్టీసీకి వచ్చిన ఆదాయం రూ.2.10 కోట్లు. ఈ ఏడాది ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రయోగాత్మకంగా అదనపు రేట్లు వసూలు చేయకుండానే సాధారణ రేటుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించారు.

సాధారణ రేట్లతో ప్రయాణికుల సంఖ్య పెంచుకోవడం ద్వారా ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో) పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకొని అమలు చేశారు. ఈ మేరకు దసరాకు ముందు 2026 ప్రత్యేక సర్వీసులను సాధారణ ఛార్జీలతోనే నడిపారు. పొరుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులను ఏపీఎస్‌ ఆర్టీసీ ఇచ్చిన ఆఫర్‌ ఆకర్షించడంతో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా ఆర్టీసీకి రూ.4.46 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ కూడా దిగొచ్చి టిక్కెట్టు ధరలు తగ్గించుకోవాల్సి వచ్చింది.

దసరా వేడుకలు ముగించుకొని వెళ్లే ప్రయాణికుల కోసం 2400 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. సాధారణ ఛార్జీతోనే ఈ నెల 10వ తేదీ ఉదయం వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచుతున్నారు. సరికొత్త ఆఫర్‌ తో ఓఆర్‌, ఆదాయం పెంపుతో ఆర్టీసీ అధికారులు జోష్‌ మీదున్నట్లు చెప్పొచ్చు. ఈ క్రమంలోనే విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకొని వచ్చే భవానీల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. మరో రెండు రోజుల పాటు భవానీల కోసం ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement