Saturday, November 23, 2024

కొత్త జిల్లాలకు ఆర్టీసీ సన్నద్ధం.. ఆర్‌ఎంల స్థానంలో డీఎంలు

అమరావతి, ఆంధ్రప్రభ: కొత్త జిల్లాలకు ఆర్టీసీ సన్నద్ధమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో..అదే స్పీడుతో ఆర్టీసీ అధికారులు కూడా వివిధ అంశాలను కొలిక్కి తీసుకొచ్చారు. జిల్లాల పునర్విభజన నేపధ్యంలో ఆర్టీసీ బస్సులు, డిపోలు, జిల్లా కార్యాలయాల సిబ్బంది విభజన తదితర కీలక లాంఛనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఉగాది నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన సాగించేందుకు కార్యాచరణ రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ శాఖలను కూడా ఉద్యోగులు, ఇతర ఆస్తుల విభజనకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో కొద్ది రోజులుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాష్ట్రవ్యాప్తంగా 126 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. బస్సులు 11,500 ఉండగా మరో రెండు వేల వరకు అద్దె బస్సులు ఉన్నాయి. కొత్త జిల్లాల పరిధులను దృష్టిలో ఉంచుకొని జిల్లాల్లో డిపోల కూర్పు, బస్సుల ఏర్పాటు జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో డిపోలు విడిపోవడం, బస్సుల సంఖ్య మారడం మినహా అదనంగా పెరిగేవీ ఏమీ లేవని అధికారులు చెపుతున్నారు. కొత్త ప్రతిపాదనల్లో భాగంగా పరిధి తగ్గుతుండటంతో రీజినల్‌ మేనేజర్ల వ్యవస్థను రద్దు చేస్తున్నారు. దీనికి బదులుగా జిల్లా మేనేజర్లను పెట్టేందుకు అధికారులు ప్రతిపాదించారు. గతంలో ఉన్న జోనల్‌ వ్యవస్థ కూడా మారబోతోంది. అన్నింటిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి నాలుగు రోజుల కిందట ప్రభుత్వానికి పంపారు.

జోనల్‌ వ్యవస్థ ఇలా..
రాష్ట్రంలో విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జోన్లు ఉన్నాయి. ఇకపై వీటి స్థానంలో జోన్‌-1, జోన్‌-2, జోన్‌-3, జోన్‌-4గా ఏర్పాటు చేస్తున్నారు. జోన్‌-1 పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాలపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉంటాయి. జోన్‌-2 పరిధిలో తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టీఆర్‌ జిల్లాలు ఉండగా, జోన్‌-3 పరిధిలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండబోతున్నాయి. ఇక నాలుగో జోన్‌ పరిధిలోకి చిత్తూరు, బాలాజీ తిరుపతి, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలు రానున్నట్లు అధికారులు చెపుతున్నారు.

బస్సుల కేటాయింపు..
కొత్తగా ఏర్పడే జిల్లాల్లోని డిపోలకు అధికారులు బస్సులు కేటాయించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అతి తక్కువ బస్సులు పాడేరు కేంద్రంగా ఏర్పాటవుతున్న అల్లూరి సీతారామ రాజు జిల్లాకు కేటాయించగా, అత్యధికంగా తిరుపతి కేంద్రంగా ఉన్న బాలాజీ జిల్లాకు ఉన్నాయి. పాడేరు జిల్లాకు 35 బస్సులు కేటాయించగా, బాలాజీ జిల్లాకు 746 బస్సులు న్నాయి. విశాఖపట్టణం జిల్లాకు 696, ఎన్‌టీఆర్‌ జిల్లాకు 643 బస్సులు సర్ధుబాటు చేసినట్లు అధికారులు చెపుతున్నారు. విజయనగరం 156, అనకాపల్లి 192 బస్సులు కేటాయించగా మిగిలిన జిల్లాలకు డిపోల సంఖ్య ఆధారంగా బస్సుల కేటాయింపు జరిగింది. విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్‌టీఆర్‌ జిల్లాకు ఎనిమిది డిపోలు ఉండగా పాడేరుకు మాత్రం ఒకే ఒక డిపో ఉంది. విశాఖపట్టణం, అనంతపురం, నంద్యాల జిల్లాలకు ఏడేసి చొప్పున డిపోలు సర్థుబాటు చేశారు.

సిబ్బంది సర్ధుబాటు..
రాష్ట్రంలోని 12 రీజినల్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని 26 జిల్లాల మేనేజర్ల కార్యాలయాలకు సర్థుబాటు చేశారు. రీజియన్ల పరిధిలోని ఆపరేషన్‌, ఇంజనీరింగ్‌ నిర్వహణ, పర్సనల్‌, ఫైనాన్స్‌, స్టాటస్టిక్స్‌ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల మేనేజర్‌ కార్యాలయాలకు సర్థుబాటు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తదనంతరం వెనువెంటనే అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement