అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మద్యం మత్తులో అనేక నేరాలు జరుగుతున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్. ద్వారకా తిరుమల రావు అన్నారు. బస్సు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రైవర్లకు నిరంతరం బ్రీత్ అనలైజర్ఒ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రూపొందించిన వాల్ పోస్టర్లు, స్టిక్కర్లు, ఫోమ్ బోర్డులను గురువారం ఆర్టీసీ హౌస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తిరుమలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్య విమోచన ప్రచార కమిటీ రూపొందించిన పోస్టర్లు, స్టిక్కర్లు, ఫోమ్ బోర్డులను బస్టాండ్ ప్రాంగణాల్లో ప్రదర్శిస్తామన్నారు. ఇదే సమయంలో ఇతర జిల్లాలకు వెళ్లే బస్సులపై అంటించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రాంగణాల్లో మద్యం సేవించి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల వల్ల వచ్చే అనర్థాలను నిరోధించేందుకు సంయుక్త కృషి అవసరమని ఈ సందర్బంగా తిరుమలరావు పేర్కొన్నారు.
ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ మద్యం దుష్ఫలితాలపై ప్రజలను చైతన్యం చేయడం ద్వారానే మద్య రహిత సమాజం సాధ్యమన్నారు. గతంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వలనే ధూమపానం తగ్గిందని చెపుతూ మత్తు పానీయాలపై కూడా అదే స్థాయిలో విస్తృత ప్రచారం జరగాల్సి ఉందన్నారు. తాము రూపొందించిన పోస్టర్లు ఆర్టీసీ బస్సులు, ప్రయాణ ప్రాంగణాల్లో ప్రదర్శించడం ద్వారా కోట్ల మంది వద్దకు మద్య వ్యసనం వలన ఎదురయ్యే దుష్ప్రరిణామాలను తీసుకెళ్లేందుకు వీలుటుందన్నారు. ఈ మహాత్తర బాధ్యతను తీసుకున్న ఆర్టీసీ ఎండీ తిరుమలరావును అభినందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో చైతన్యం కోసం విద్యా సంవత్సరం ప్రారంభంలో విస్తృత కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు టోల్ గేట్ల వద్ద బ్రీత్ అనలైజర్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడాన్ని అరికట్టేందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఈబీ ఏర్పాటు నుంచి నాటుసారా, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై వేలల్లో కేసుల పెట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో 15 చోట్ల వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిని బలోపేతం చేసి ఉచితంగా చికిత్సను అందించడానికి కృషి జరుగుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.