Saturday, November 23, 2024

ఆర్టీసీలో ఆరని అసంతృప్తి జ్వాల.. కొత్త పీఆర్సీతో నష్టపోయామంటున్న ఉద్యోగులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ(పీటీడీ) ఉద్యోగుల్లో పీఆర్సీ ఉత్తర్వులపై అసంతృప్తి కొనసాగుతోంది. ప్రభుత్వంలో విలీనంతో మెరుగైన పీఆర్సీ ఆశించిన తమకు ప్రభుత్వ ఉత్తర్వులు నిరాశకు గురి చేశాయని ఉద్యోగులు చెపుతున్నారు. వేతన సవరణ ఉత్తర్వులు జారీ చేసి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ..ప్రభుత్వం పునరాలోచన చేస్తుందనే ఆశాభావంతో ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు సవరిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఉత్తర్వులు జారీ చేసిన ఐదు నెలల తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జీవోలు జారీ చేశారు. నెలల తరబడి ఉత్తర్వుల జారీకి జాప్యం కావడంతో పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై పీటీడీ ఉద్యోగులు ఆశలు పెంచుకున్నారు. తీరా 2018 బేసిక్‌పై 3.1శాతం కలుపుతూ ఫిట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతం కంటే ఫిట్‌మెంట్‌ తగ్గించడంతో పాటు నష్టపోయిన డీఎలు కలపకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2017 పీఆర్సీ ప్రకారం తమకు 25శాతం ఫిట్‌మెంట్‌ ఉందని చెపుతూ పదకొండో వేతన కమిటీ ఛైర్మన్‌ అశ్‌తోష్‌ మిశ్రా సిఫారసులు అమలు చేసినా బాగుండేదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో విలీనమైనందుకు ఆనందపడాలో..ఫిట్‌మెంట్‌ తగ్గించినందుకు బాధపడాలో తెలియడం లేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాత విధానంలో..

ఇప్పటి వరకు ఆర్టీసీ 2017 ఆర్‌ పీఎస్‌ మేరకు జీతాలు చెల్లిస్తున్నారు. ఇందులో 2019 డిసెంబర్‌ వరకున్న డీఏ(కరువు భత్యం) 11.6శాతం, ఆర్టీసీ హెచ్‌ఆర్‌ఎ(ఇంటి అద్దె) 20శాతం కలుపుకొని జీతం వస్తుంది. ఆర్టీసీ 2017 ఆర్‌పీఎస్‌ ప్రకారం 2020, 2021 వరకు నాలుగు డీఎ(12.74) శాతం కలపాల్సి ఉంది. ఇది జరిగిన పక్షంలో రూ.27,850 బేసిక్‌ ఉన్న కండక్టర్‌కు ఆర్టీసీ 2017 ఆర్‌ పీఎస్‌(సవరించిన వేతనాలు) ప్రకారం నాలుగు డీఎలు కలుపుకొని జూన్‌ నెల జీతం సుమారుగా రూ.40,199 వస్తుందని ఉద్యోగులు చెపుతున్నారు. ఇందులో బేసిక్‌ 27,850, డీఎ రూ.3231(11.6శాతం), హెచ్‌ఆర్‌ఎ రూ.5570(20శాతం), 2020, 2021లో రావాల్సిన నాలుగు డీఎలు రూ.3548(12.74) శాతం ఉంటుందని చెపుతున్నారు.

ఇప్పుడిలా..

ఆర్టీసీ ఉద్యోగులను 2020 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుతంలో విలీనం చేశారు. రవాణాశాఖ పరిధిలోని ప్రత్యేకంగా పీటీడీని ఏర్పాటు చేసి ఉద్యోగులను కలిపారు. ఉదాహరణకు గతంలో రూ.27,850 బేసిక్‌ ఉన్న కండక్టర్‌ కు ప్రభుత్వ కొత్త 2018 ఆర్‌పీఎస్‌ ప్రకారం బేసిక్‌ను రూ.29,130గా నిర్ణయించారు. ఈ మేరకు 2018 ఆర్‌పీఎస్‌ ప్రకారం 2021 వరకు ఉన్న 20.02శాతం డీఎలు, హెచ్‌ఆర్‌ఎ 16శాతం కలుపుకొని జీతం వస్తుందని చెపుతున్నారు. బేసిక్‌తో పాటు డీఎ రూ.5832, హెచ్‌ఆర్‌ఎ రూ.4661 కలుపుకొని జీతం రూపంలో రూ.39,623 వస్తుందని ఉద్యోగులు చెపుతున్నారు. గతంతో పోల్చితే డీఎతో కలుపుకొని వచ్చే జీతం తక్కువగా ఉండటమే కాక 2021 జరగాల్సిన వేతన సవరణ కోల్పోయామంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

రేపు విజయవాడలో సదస్సు..

ప్రభుత్వ పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగుల అసంతృప్తి నేపధ్యంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) బుధవారం విజయవాడలో సమావేశం నిర్వహిస్తోంది. కొత్త పీఆర్సీతో జరిగిన నష్టంపై చర్చించడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement