ప్రభన్యూస్: దూరప్రాంత ప్రయాణికులకు ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని దూర ప్రాంత సర్వీసుల్లో 60 రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకునేందుకు వెసులుబాటు కలిపించింది. ప్రస్తుతం ఈ అవకాశం 30 రోజుల ముందుగానే ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు వీలైనన్ని ఎక్కువ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంక్రాంతి పర్వదినంతో పాటు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో వేర్వేరు ప్రాంతాల నుంచి పలువురు సొంత ప్రాంతాలకు వెళుతుంటారు. ఆర్టీసీ టిక్కెట్లు అందుబాటులో లేక పలువురు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుంటారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో ఈ సమస్య పెద్ద ఎత్తున తలెత్తుతుంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగువారు సంక్రాంతికి సొంత గ్రామాలకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఏటా ప్రైవేటు ట్రావెల్స్ దందాపై పలు ఆరోపణలు రావడం, రవాణాశాఖ అధికారులు నామమాత్రపు దాడులు చేయడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలోనే ఆర్టీసీ అధికారులు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం పెంచుతూ ప్రయాణికులకు వెసులుబాటు ఇచ్చింది. గత దసరా సమయంలో స్పెషల్ సర్వీసుల నుంచి ఆశించిన ఆదాయం రాకపోవడంతో ముందస్తుగా మేల్కొన్న ఏపీఎస్ ఆర్టీసీ పండుగల సీజన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, కడప, అనంతపురం వంటి ప్రాంతాలకు, ఆయా ప్రాంతాల నుంచి అన్ని జిల్లాలకు అడ్వాన్స్ రిజర్వేషన్ కలిపిస్తున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు అడ్వాన్స్ వ్యవధిని పెంచినట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital