అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రవాణాశాఖ చెక్ పోస్టులు దోపిడీకి కేరాఫ్ కేంద్రాలుగా మారాయి. వాహనదారుల నుంచి ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తూ అధికారులు వాటాలు వేసుకుంటున్నారు. పెరిగిన ఇంధన ధరలు..రోడ్డు, హరిత పన్ను, టోలు బాదుడు..ఇలా అనేక పన్నులతో రవాణా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే..రవాణా చెక్ పోస్టుల దోపిడీతో మరింత కుధేలవుతున్నారు. చెక్ పోస్టులంటే కాసులు కురిపించే కల్పతరువుగా అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్ దక్కించుకునేందుకు ఎంతిచ్చేందుకైనా అధికారులు సిద్ధమవతున్నారంటె..రూ.లక్షల్లో వస్తున్న రోజువారీ ఆదాయమే కారణం. వరుస ఆరోపణల నేపధ్యంలో మూడు రోజుల కిందట ఏసీబీ అధికారులు మూడు చెక్పోస్టులపై ఆకస్మిక తనిఖీలు చేసి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్త సంచలనం కలిగిస్తోంది.
గతంలో ఎప్పుడూ లేనిరీతిలో ఒకేసారి ఇంత మొత్తంలో నగదు దొరకడం..పెద్ద ఎత్తున అధికారులు పట్టుబడటం ఇదే తొలిసారి అంటూ రవాణాశాఖ అధికారులు చెపుతున్నారు. రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 13 చెక్ పోస్టులు ఉండగా..వివిధ శాఖలతో కూడిన మరో ఐదు సమీకృత చెక్ పోస్టులు ఉన్నాయి. సరిహద్దు చెక్ పోస్టుల ద్వారా వేర్వేరు రాష్ట్రాల నుంచి లారీలు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుంటాయి. పర్మిట్ నిబంధనల ఉల్లంఘన, తగిన ధృవీకరణ పత్రాలు లేకపోవడం, ఓవర్ లోడింగ్ తదితర వాహనాల సంఖ్య పెద్ద మొత్తంలోనే ఉంటుంది. వాహనాలు తనిఖీ చేసి ప్రభుత్వ సొమ్మును కట్టించాల్సిన రవాణాశాఖ అధికారులు సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారు. ఏదో మొక్కుబడి రుసుమును ప్రభుత్వ లెక్కల్లో చూపుతూ పెద్ద మొత్తంలో వచ్చే నగదును జేబుల్లో వేసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఆదాయం దండిగా ఉన్న చెక్ పోస్టు పోస్టింగ్‌ల కోసం అధికారులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసి పోస్టింగ్ దక్కించుకుంటారు.
ఐదుగురు అధికారులు అరెస్టు..
మూడు రోజుల కిందట ఏసీబీ అధికారులు ఒడిశా సరిహద్దు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, తెలంగాణ సరిహద్దు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, కృష్ణాజిల్లా గన్నవరంలోని అంతర్గత చెక్‌పోస్టుపై ఆకస్మిక దాడి చేశారు. తెల్లవారుజామున నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో రూ.4లక్షల అనధికార నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, నలుగురు సహాయ మోటారు ఇన్స్పెక్టర్లు, నలుగురు హోంగార్డులు, నలుగురు ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒక్క రోజు తనిఖీలోనే ఇంత మొత్తంలో నగదు పట్టుబడిందంటే రోజువారీ ఆదాయం ఏ రేంజ్లో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్థేశించిన రుసుము కంటే అధిక వసూళ్లు, లారీ డ్రైవర్లను వేధింపులకు గురి చేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో వెలుగు చూసింది.
పోస్టింగ్ కోసం పైరవీలు..
సరిహద్దు చెక్ పోస్టుల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో పైరవీలు జరుగుతున్నాయి. ఉన్నతస్థాయిలో గాడ్ఫాదర్లను కలిసి పోస్టింగ్ దక్కించుకునే వారు కొందరైతే..రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి పోస్టింగ్‌లు కొట్టేసే వారు మరికొందరు. అనేక మంది ప్రజా ప్రతినిధుల సిఫారసు చేసుకొని పోస్టింగ్‌లకు పొందుతున్నారు. గత సాధారణ బదిలీల్లో ఇది మరింత ఎక్కువగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రవాణాశాఖలో ఫోకల్ పోస్టింగ్‌ల కోసం రూ.25 లక్షలకు పైగానే ముట్ట చెప్పినట్లు ఆశాఖ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. తడ, ఇచ్చాపురం, పొందుగుల వంటి చెక్ పోస్టుల్లో పోస్టింగ్‌ను రవాణాశాఖలో హాట్ కేకులుగా చెపుతారు. ఇక్కడ పోస్టింగ్ కోసం ఎంతిచ్చుకునేందుకైనా కొందరు సిద్ధమవుతారని తెలుస్తోంది.
వేధింపులు తాళలేక..
రవాణా రంగం కుధేలైంది. రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు..రోడ్డు, హరిత పన్ను పెంపు, టోలు ఫీజులు మోత మోగుతున్నాయి. కోవిడ్ తదనంతర పరిణామాల నేపధ్యంలో ఓ వైపు కిరాయిలు లేక లారీ యజమానులు రోడ్డున పడుతున్నారు. అనేక మంది వాహనాలు నడపలేని స్థితిలో అమ్మేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి తగిన సహకారం కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రవాణాశాఖ చెక్ పోస్టుల్లో వేధింపులు ఎక్కువైనట్లు లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. రకరకాల కారణాలు చూపుతూ డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తుండటంతో ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళుతున్నాయి. గత కొంతకాలంగా ప్రభుత్వం ఇచ్చిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రానున్న రోజుల్లో సైతం ఇదే తరహా తనిఖీలు నిర్వహించనున్నట్లు ఏసీబీ వర్గాలు చెపుతున్నాయి.