Monday, September 30, 2024

ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ కోసం రూ. 450 కోట్లు మంజూరు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం రూ. 450 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, తలారి రంగయ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 13వ షెడ్యూల్ ప్రకారం ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

యూనివర్సిటీకి భౌగోళిక హద్దులుగా యావత్ రాష్ట్రాన్ని నిర్ణయిస్తూ 2019లో సెంట్రల్ యూనివర్సిటీస్ చట్టంలో సవరణలు చేసినట్టు వివరించారు. రాష్ట్రపతి ఆమోదంతో 2019 ఆగస్టు 5 నుంచి ఈ సవరణ అమల్లోకి వచ్చిందని తెలిపారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచే యూనివర్సిటీ కార్యాకలాపాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను అనుసరించి కొత్త క్యాంపస్ నిర్మాణం కోసం కేంద్రం రూ. 450 కోట్లు మంజూరు చేసిందని, అవసరాన్ని బట్టి కేంద్రం నిధులు విడుదల చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు రూ. 31.24 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement