Tuesday, December 3, 2024

KNL | గిరిజన తండాలకు రూ.4.90 కోట్లు మంజూరు… బైరెడ్డి శబరి

నంద్యాల బ్యూరో, నవంబర్ 21 : గిరిజన తండాల అభివృద్ధి కోసం, వారి తండాల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు, రహదారుల నిర్మాణానికి రూ.4.90 కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. గురువారం ఆమె తెలిపిన వివరాల మేరకు… జిల్లాలోని గిరిజన తండాలైన కపిలేశ్వరం నుంచి జనాలగూడెం వరకు తారురోడ్డు నిర్మాణం కోసం రూ.4.40 కోట్లు మంజూరయ్యాయి. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం విలువైన, సారవంతమైన వ్యవసాయ భూములు, ఇల్లు త్యాగం చేసి సర్వం కోల్పోయి నల్లమల అరణ్యంలో కనీస వసతులకు దూరంగా జీవిస్తున్న అడవి బిడ్డలకు కనీసం రోడ్డు మార్గం ఏర్పాటు చేసి, రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసి చీకట్లో మగ్గుతున్న ఆ గ్రామాలకు బయటి ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు, విద్యుత్ సరఫరా కోసం నిధులు మంజూర‌య్యాయ‌ని డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అరణ్యంలో బయటి ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్న బలపాలతిప్ప, జానాలచెంచుగూడెం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు రూ.50 లక్షలు, తారురోడ్డు నిర్మాణం కోసం రూ.4.40 కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించిన‌ట్లు తెలిపారు. కపిలేశ్వరం గ్రామం నుంచి సిద్దేశ్వరం, బలపాలతిప్ప, జానాలగూడెం వరకు 7.10 కిలోమీటర్లు దూరం వరకు 7.30 మీటర్ల వెడల్పుతో మెటల్ రోడ్డు, వాటిపై 3.75 మీటర్ల వెడల్పుతో బీటీ (తారు) రోడ్డు నిర్మాణం కోసం, రోడ్డు ప్రక్కన విద్యుత్ స్థంబాలు, విద్యుత్ దీపాలు వేసేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఎంపీ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ప్రధానమంత్రి జనజాతీ ఆదివాసిన్యాయ్ మహా అభియాన్ పథకం ద్వారా, ట్రైబల్ గ్రూప్ ఆధ్వర్యంలో తారు రోడ్డుకు 4.40 కోట్ల రూపాయలు, విద్యుత్ సరఫరాకు 50 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement