Friday, November 22, 2024

రౌడీ షీటర్ల బరి తెగింపు.. భూదందాలు, సెటిల్ మెంట్లలో జోక్యం

మంగళగిరి క్రైమ్, ఏప్రియల్ 23,(ప్రభ న్యూస్):*నవ్య నగరం మంగళగిరి లో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. గత కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు రాజకీయ నేతల అండతో భూ దందాలు, సెటిల్ మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారు. వివాదాస్పద భూముల్లో తలదూర్చి కోట్ల రూపాయలను గడిస్తున్నారు. రౌడీ షీటర్ల ఆగడాలు తెలిసినా హైకోర్టు ఆదేశాలకు తోడు రాజకీయ ఒత్తిడి కారణంగా పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారు. భూ వివాదాల్లో చిక్కుకుంటున్న కొందరు బడా బాబులు ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు రౌడీషీటర్లను ఉసి గొల్పుతూ దాడులను ప్రోత్స హిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

వరంగా మారుతున్న వివాదాస్పద భూములు.

నగరంలో వంద గజాల భూమి రూ. 50లక్షల నుంచి రూ.70లక్షల వరకూ పలుకుతుంది. అది వివాదస్పద భూమైతే రౌడీషీటర్ల కు వరంగా మారుతుంది. సెటిల్​మెంట్​ చేస్తే లక్షల్లో పర్సంటేజీలు.. ఈజీ మనీ సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న కొంతమందికి ఇటువంటి భూ దందాలు అక్షయపాత్రలా కనిపిస్తున్నాయి. ఒక భూదందాలో దూరి సెటిల్​చేస్తే లక్షల్లో వాటాలు.. రౌడీషీటర్లు, రియాల్టర్లు, వారి అనుచరులు ఇలా ఒకరేమిటీ అందరు సెటిల్​మెంట్లలో మునిగితేలుతున్నారు.

నకిలీ పత్రాలతో మోసం..

.ఎవరైనా రియాల్టర్లకు భయపడకుండా ఎదురు తిరిగితే కొనుగోలు చేయాలనుకునే స్థలం లో ప్రాబ్లం ఉందని, లీగల్ ఇబ్బందులు ఉన్నాయని కొనుగోలుదార్లకు చెప్పి వ్యాపారం సాగనివ్వకుండా అడ్డుపడుతుంటారు. అవసరమనుకుంటే మరో అడుగు ముందుకేసి నగరానికి చెందిన కొందరు స్థానిక రౌడీషీటర్లను పిలిపించి ఫోన్‌లు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిస్తే వెంటనే ఆయా ప్లాట్ల పేరుతో నకిలీ సంతకాలతో పత్రాలు సృష్టిస్తారు. వెంచర్, ప్లాటు నిర్వహణదారుడు అదే ప్లాటును తమకు విక్రయించాడని చెప్పి అవతలి వారిని బెదిరింపులకు గురిచేస్తుంటారు. దీంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తారు. ఈ విధంగా వ్యాపారాన్ని సాగనీయరు. ఈ రౌడీ ముఠాకు తలొగ్గి దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు రియల్టర్లు వాటాలు ఇచ్చి వ్యాపారాలు కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. *ప్రాణభయం కలిగిస్తున్న వైనం* తెలిసినవారికి తమవే ప్లాట్లు అని చెప్పి విక్రయిస్తారు. ప్లాట్లు విక్రయించిన వారికి వెంచర్ యజమానులు మామూలుగా అయితే కమీషన్ ఇస్తారు. కానీ వీరి రూటే సపరేటు అన్నట్లుగా రౌడీషీటర్లు వాటా ఇవ్వాలని అడుగుతారు. లేకుంటే ప్రస్తుతానికి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్న మరో రౌడీషీటరు పేరు చెప్పి అన్న తాలూకా మనుషులమని బెదిరిస్తారు. వాటాలు ఇవ్వకుంటే అంతే సంగతులు అన్నట్లు ప్రాణభయాన్ని కలిగిస్తారు. చేసేదిలేక కొత్తగా వచ్చిన వ్యాపారులు వారికి వచ్చిన దాంట్లో వాటా ఇస్తూ మెల్లగా వ్యాపారం ముగియగానే మరో ప్లాట్లు వేయకుండా జారుకుంటున్నారు.

- Advertisement -

పెరుగుతున్న ఫిర్యాదులు

గతంలో భూవివాదం తలెత్తితే అసలు యజమాని కోర్టుకు వెళ్లేవారు. ధనబలం.. రాజకీయ పలుకుబడితో భూకబ్జాలు చేస్తుండడంతో బాధితులు సత్వరమే న్యాయం కోరుతూ పోలీస్​ స్టేషన్లను, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ న్యాయం దొరుకుతుందా అంటే.. అక్కడికి బాధితుల కంటే ముందే రౌడీషీటర్లు వాలిపోతున్నారు. కోర్టు, రెవెన్యూ కోర్టుకు వెళ్లినా కూడా సంవత్సరాల కొద్దీ సమయం పడుతుందని బాధితుల్లో ఎక్కువ మంది పోలీసులు, నేతల అనుచరులు, రౌడీషీటర్ల వద్దకే భూ పత్రాలను పట్టుకుని వెళ్తున్నారు. పోలీస్​స్టేషన్లకు సైతం ఇటీవల కాలంలో ఎక్కువగా భూ ఆక్రమణల కేసులపైనే ఫిర్యాదులు వస్తున్నాయని సమాచారం.

కౌన్సెలింగ్ ఏదీ ?

నగర పరిధిలో రౌడీషీటర్లను ప్రతి ఆదివారం ఆయా పోలీస్ స్టేషన్లకు పిలిపించి సీఐ స్థాయి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించేవారు. చివరలో వారి సంతకాలు తీసుకుని పంపేవారు. ఈ ప్రక్రియలో ఆ వారంలో రౌడీషీటర్లు ఏవైనా దౌర్జన్యాలకు పాల్పడివుంటే పోలీసులు వాటిని గుర్తించి తమదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించేవారు.ఈ తరహా కౌన్సెలింగ్ వల్ల పోలీసులు అంటేనే రౌడీషీటర్లలో ఓ విధమైన భయం ఏర్పడి గొడవలకు దూరంగా వుంటూ వుండేవారు. ఈ నేపధ్యంలో కోర్టు ఆదేశాలతో పోలీసులు గత కొన్ని నెలలుగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించక పోవడంతో కొందరు రౌడీషీటర్లు తిరిగి తమ నేరమయ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. రౌడీషీటర్లను పోలీసులు స్వేచ్ఛగా వదిలి వేయడంతో తిరిగి వారు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు రౌడీషీటర్లపై దృష్టి సారించి వీరి వల్ల ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజల ధన, ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement