మూడ్రోజులకు కాస్త తగ్గిన వానలు
మెల్లగా తేరుకుంటున్న తెలంగాణ
రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు
ఖమ్మంలో తగ్గుతున్న వరద ప్రవాహం
సహాయక కార్యక్రమాలకు వర్షం ఆటంకం
వరంగల్‌లో తగ్గుముఖం పట్టిన వాన
సహాయ కార్యక్రమాలు కొనసాగింపు
జిల్లాల వారీగా మంత్రుల పర్యటనలు
పాలేరులో మంత్రి పొంగులేటికి ప్రమాదం
ఖమ్మం-మహబాద్ మధ్య కొట్టుకుపోయిన వంతెన
సింగరేణిలో నిలిచిన బొగ్గు తవ్వకాలు
ఆంధ్రప్రభ స్మార్ట్-సెంట్రల్ డెస్క్
అల్పపీడన ప్రభావంతో అతలాకుతలమైన తెలంగాణ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. గత మూడు రోజులుగా కుండపోతతో హైదరాబాద్ నగరంతోపాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్‌నగర్ జిల్లాలు అస్తవ్యస్థమయ్యాయి. సోమవారం ఖమ్మం తప్ప మిగిలిన ప్రాంతాల్లో వర్షం తగ్గింది. ఖమ్మంలో ఈ రోజు కూడా వర్షం కురుస్తోంది. ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల కోసం రంగంలోకి దిగారు. దీంతో ఖమ్మంలో సహాయ కార్యక్రమాలకు కొంత ఆటంకటం కలుగుతోంది. ముంపునకు గురైన ఖమ్మంలోని 15 కాలనీలను చుట్టుముట్టిన వరద నీరు తగ్గుముఖం పట్టింది. అయితే నిన్నటి నుంచి ఎలాంటి ఆహారం అందకపోవడంతో వరద బాధితులు అవస్థలు పడుతున్నారు.
ఆకేరు నదిపై వంతెన..
మహబూబాబాద్-ఖమ్మం మధ్యలో ఆకేరు నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. నీరు తగ్గిన తర్వాత వంతనె కొట్టుకుపోయిన విషయం ప్రజలు, అధికారులు గమనించారు. కే.సముద్రం వద్ద ధ్వంసమైన రైల్వే ట్రాక్ పనులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. మూడు రోజుల కిందట నుంచి నిలిచిపోయిన సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలు ఇంకా ప్రారంభం కాలేదు. మణుగూరు, కొత్తగూడెం, భద్రచలం లోతట్టు ప్రాంతాల నుంచి నీరు వెళ్లిపోవడంతో ఆయా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ అంతటా నిన్నటి నుంచి ఈ రోజు వరకు 560 బస్సులు టీఎస్ ఆర్‌టీసీ రద్దు చేసింది. ఇప్పుడిప్పుడు డిపోల నుంచి బస్సులు కదులుతున్నాయి.
రాకపోకల పునరుద్ధరణ..
హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు పునరుద్ధరించారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, నార్కట్‌పల్లి, గుంటూరు మీదుగా బస్సులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. నిన్న గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆకేరు బ్రిడ్జి వద్ద వరదలో చిక్కుకుపోయిన వారిని రాత్రి పన్నెండు గంటలకు ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు వెళ్లి సురక్షితంగా తీసుకు వచ్చారు. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో బైక్‌పై పర్యటిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు.
ఖమ్మంలో స్తంభించిన జనజీవనం
ఖమ్మంలో వరద నీరు తగ్గుముఖం పట్టినా ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇక్కడ జనజీవనం స్తంభించింది.
మున్నేరు నీటి ఉధృతి తగ్గడంతో సహాయ కార్యక్రమాలకు ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.
మున్నేరు వాగు నీరు తగ్గు ముఖం పట్టడంతో రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర్‌నగర్, మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీ, కవిరాజ్‌నగర్, వీడియోస్ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్ రోడ్డు, కరుణగిరి సాయికృష్ణనగర్ నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఇళ్ల పైకి చేరుకున్న వరద బాధితులకు ఉదయం పదకొండు వరకు ఎలాంటి ఆహారం అందకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఒకవైపు వర్షం కురవడంతో సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు కూడా అందించట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరుణగిరి వద్ద సాయి కృష్ణ నగర్ వాసులు ఆందోళనకు దిగారు.
సింగరేణిలో నిలిచిన బొగ్గు తవ్వకాలు
వర్షాలు ప్రభావంతో సింగరేణిలో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సింగరేణిలో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. ఇంకా నీరు నిలిచి ఉండడంతో ఈ రోజు తవ్వకాలు పునరుద్ధరించలేదు.
బ్రిడ్జి మీద 15 గంటలు నిరీక్షణ
ఖమ్మంలోని ఆకేరు నది ఉధృతంగా ప్రవహిస్తోందని చూడటానికి ప్రకాష్‌నగర్ బ్రిడ్జి వద్దకు వెళ్లిన తొమ్మిది మంది 15 గంటల నిరీక్షణ అనంతరం సురక్షితంగా బయటపడ్డారు. నిన్న ఉదయం ఏడు గంటలకు నీరు చూడటానికి బ్రిడ్జిపైకి వారు వెళ్లారు. బ్రిడ్జి చుట్టూ నీరు ఒక్కసారిగా చుట్టిముట్టడంతో వారు అక్కడ చిక్కుకుపోయారు. నీటి ఉధృతి తగ్గకపోవడంతో వారిని ఎవరూ రక్షించలేకపోయారు. ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు కూడా నీరు తగ్గే వరకూ వేచి ఉండి రాత్రి 12 గంటలకు బయటకు సురక్షితంగా తీసుకు వచ్చారు. దీంతో ఆయా కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం
వరద ప్రాంతాలను పరిశీలించడానికి బైక్‌పై వెళ్లిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. పాలేరు నియోజకవర్గంలో ముంపు అనంతరం మున్నేరు నదికి ఒక వైపు ఉన్న గ్రామాలను మంత్రి పొంగులేటి బైక్ మీద పర్యటించారు. రూరల్ మండలం మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగం నగర్, దానవాయిగూడెంలో వరద ఉధృతి కారణంగా నీట మునిగిన కాలనీల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్‌పై తిరుగుతూ పర్యటించారు. అయితే రోడ్ల మీద ఒండ్రు ఉండడంతో బైక్ ప్రమాదానికి గురైంది. ఆయన కాలిక చిన్న గాయమైంది. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, సెక్యూరిటీ ఊపిరి పీల్చుకున్నారు.
వరద తగ్గిన తర్వాత చూస్తే వంతెన మాయం
ఖమ్మం-మహబూబాబాద్ మధ్య ఆకేరు నదిపై ఉన్న వంతెన వరద నీటిలో కొట్టుకుపోయింది. డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామం వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జితో మహబూబాబాద్ ఖమ్మం జిల్లా మధ్య రాకపోకలు బంద్. వంతనెపై కూడా నీరు పారుతుండడంతో వంతెన కొట్టుకుపోయిన విషయం తెలియదు. నీరు తగ్గిన తర్వాత అక్కడ వంతెన లేకపోవడంతో వరద నీటిలో కొట్టుకుపోయిందని అధికారులు, ప్రజలు గమనించారు. ఈ వంతెన కొట్టుకుపోవడంతో ఖమ్మం-మహబూబాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మంత్రులు పర్యటన
వరద ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటిస్తున్నారు. మధిర నియోజకవర్గలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తదితరులు పర్యటించి బాధితులకు భరోసా ఇస్తున్నారు.
మహబూబాబాద్ వరద బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి సీతక్క
మహబూబాబాద్ జిల్లా: రెండు రోజులుగా తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వరద బీభత్సాన్ని సృష్టించింది. మహబూబాబాద్ జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ పట్టణంలో సోమవారం మంత్రి సీతక్క పర్యటించారు. వరద బాధితులను మంత్రి సీతక్క పరామర్శించి.. భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, కూలిన ఇండ్లను ఆమె పరిశీలించారు.
వరంగల్‌లో తగ్గిన వర్షం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం తగ్గింది. దీంతో ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు సహాయ సహకారాలు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లాలో అధిక నష్టం వచ్చింది. వరద పూర్తిగా తగ్గిన తర్వతా వరద నష్టం అంచనాలు వేస్తామని అధికారులు తెలిపారు.
560 బస్సుల రద్దు
ఏపీ, తెలంగాణ మధ్య 560 బస్సులు రద్దు చేసిన టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలను ముంచెత్తడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల భారీగా వరద ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వెళ్లే బస్సులను రద్దు చేసింది. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సులను రద్దయ్యాయి.