నోటికొచ్చినట్టు ఆడవాళ్లపై మాట్లాడొద్దు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా నారా భువనేశ్వరి కామెంట్లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. నారా బువనేశ్వరిపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూతురుగా నారా భువనేశ్వరిపై గౌరవం ఉందని రోజా అన్నారు. అయితే, అసెంబ్లీలో అనని మాటలు గురించి మాట్లాడి.. ఆ గౌరవాన్ని చెడగొట్టుకోవద్దు సూచించారు. ఎవరి పాపానా ఎవరు పోయారో అందరికీ తెలుసన్నారు. ఆడవారిని ఏడిపించిన వారి పాపాన వారే పోతారని భువనేశ్వరి అన్న మాటలు నిజమేనన్న రోజా.. అందుకే 23 అసెంబ్లీ స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే భువనేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉందని, మీరు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంత మంది మహిళలు ఎడ్చారో మీకు తెలియదా? అని రోజా ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీలో తనను కూడా చాలా సార్లు కన్నీళ్లు పెట్టించారని, ఎంతో అవమానానికి గురి చేశారని చెప్పారు. చంద్రబాబు దొంగ ఏడుపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ”ఎన్టీఆర్‌ను ఏడిపించారు.. నన్ను కూడా ఏడిపించారు. చంద్రబాబు పాలనలో కాల్‌మనీ కేసులో మహిళలు వ్యభిచారం చేయాల్సి వచ్చింది. గోదావరి పుష్కరాల్లో 30 మహిళలు చనిపోయారు.. అప్పుడు భువనేశ్వరి ఎందుకు నోరు తెరవలేదు..?. జరగని దానికి జరిగిందని చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారు” అని రోజా వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నిన్న(డిసెంబర్ 20)తిరుపతి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నోటికొచ్చినట్టు ఆడవాళ్లపై మాట్లాడొద్దు ఆమె అన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలపై బాధపడ్డానని, నా భర్త చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసినవారు వాళ్లపాపాన వాళ్లేపోతారు అని చెప్పారు. వాళ్ల క్షమాపణ నాకు అక్కర్లేదు అని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోనన్న భువనేశ్వరి.. బాధలో ఉన్న తనకు కుటుంబం అండగా నిలిచిందన్నారు. హెరిటేజ్‍ను ఎవరూ టచ్ చేయలేరు నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital