బల్లికురవ : మండలంలోని ప్రధాన రహదారులతో, పాటు గ్రామీణ ప్రాంత రహదారులు కూడా మోకాలిలోతు గోతులతో, అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించకుండా వేస్తే రెప్పపాటుకాలంలో తప్ప పడిపోవాల్సిందే. ప్రధానంగా మండల కేంద్రమైన బల్లికురవ నుండి మార్టూరు రహదారిలో, నక్కబొక్కలపాడు నుండి మొదలైన మోకాలి లోతు గోతులు నాగరాజు పల్లి వరకు వాహణదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అదేవిధంగా బల్లికురవ నుండి వైదన రహదారిలో చెన్నుపల్లి నుండి మొదలు వైదన వరకు ఇదే విధమైన పరిస్థితి.
అసలే గోతులు, ఆపై వానలతో ఈరోడ్లపై వెళ్తే ఖర్చు లేకుండా కాళ్లు, చేతులు విరగొట్టుకోవాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. వాహనదారుల సహనానికి పరీక్షగా మారాయి. గడచిన రెండు సంవత్సరాలుగా తట్టెడు మట్టికి కూడా నోచుకోని మండలంలోని అన్ని రహదారుల పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఈ రోడ్లు ఇంతేనా… వీటిని పట్టించుకునే నాథుడే లేడా అని వాహణదారులు ఆరోపిస్తున్నారు. గోతుల బాధ చాలదన్నట్లుగా మరికొన్ని రహదారుల్లో రెండు వైపులా అడవి తుమ్మ చెట్లు మరింత ప్రమాదభరితంగా మారాయి. ప్రజానీకం ఇంత ఇబ్బంది పడుతున్నా… ప్రజా ప్రతినిధులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ఇలాంటి ప్రమాదకర పరిస్థితులపై స్పందించిన దాఖలాలు లేవు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
AndhraPrabha #AndhraPrabhaDigital