అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు, సంభవిస్తున్న మరణాల నివేదికలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఏటా జరుగుతున్న ప్రమాదాలు, మరణాల శాతంలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఒకవైపు వాహనదారులు, మరోవైపు అధికార యంత్రాం గం గండి కొడుతోంది. వాహనదారుల అవగాహనాలోపం శాపంగా మారుతుండగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రమాదాలకు హేతువు గా మారుతున్న పరిస్థితులు ఉన్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారుల్లో కన్నా అధికంగా రాష్ట్ర రహదారుల్లోనే ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదాల నివారణకు కృషి చేయా ల్సిన రోడ్డు భద్రతా మండలి కేవలం మొక్కుబడి సమావేశాలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నా యి.
15 శాతం మేర మరణాల సంఖ్యను తగ్గించే లక్ష్యాన్ని ప్రభుత్వం విధిస్తే తాజా గణాంకాలు 26 శాతం మేర పెరిగినట్లుగా వెల్లడిస్తున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 15 వేల 086 ప్రమాదాలు చోటు చేసుకోగా.. 6 వేల 018 మరణాలు సంభవించగా గాయ పడిన వారి సంఖ్య 16 వేలకు పైగా ఉన్నట్లు నివేదికలో తేట తెల్లం చేస్తున్నాయి. 2021తో పోలిస్తే 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు 7 శాతం మేర మరణాల సంఖ్య పెరగ్గా 10 శాతం మేర ప్రమాదాల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక గాయపడిన వారి గణాంకాలను పరిశీలిస్తే దాదాపు 12 శాతం పెరుగుదల ఉంది. ఈ ప్రమాదాలకు అతివేగం ఒక కారణమైతే అవగాహనరాహిత్యం మరో కారణంగా కనిపిస్తోంది. వాహన దారులు సరైన నియమాలను పాటించకుండా ఉండటంతో పాటు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నా యి. ఎక్కువగా కార్లు, లారీలతో పాటు బస్సుల ప్రమాదాలు జరగుతుం డగా ఇక ద్విచక్ర వాహనాల ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.
ప్రతి ఏటా రహదారి భద్రత వారోత్సవాలను ఏదో మొక్కుబడిగా నిర్వహి స్తూ అధికార యంత్రాంగం చేతులు దులుపుకుంటుంది. కొన్నిచోట్ల భారీ గా కార్యక్రమాలు నిర్వహించి వాహనాదారులకు అవగాహన కల్పించేం దుకు చేస్తున్న ప్రయత్నాలు వృథా అవుతున్నాయి. జిల్లాల్లో రహదారి భద్రత మండలి సమావేశాలు నిర్వహిస్తున్నా తీసుకున్న నిర్ణయాలను మాత్రం క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రమాదాలు పెరుగు తూ వస్తున్నాయి. ఇంకోవైపు జాతీయ, రాష్ట్ర రహదారుల్లో బ్లాక్‌స్పాట్‌లు గుర్తించి వాటిని సరిచేసేందుకు పూర్తిస్థాయిలో కార్యాచరణ జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారుల్లో ఎన్‌హెచ్ ఏఐ కొంతమేరకు బ్లాక్‌స్పాట్‌లను సరిచేస్తున్నా రాష్ట్ర రహదారుల్లో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
రహదారుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. జిల్లా స్థాయిలో లీడ్ ఏజెన్సీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ మేరకు కార్యాచరణ ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఇవన్నీ ఎలా ఉన్నా వాహనదారులు రోడ్డు భద్రత పట్ల సరైన అవగాహనను పెంపొందించుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న పరిస్థితులు ప్రమాదా లకు కారణమవుతున్నాయి. ఇంకోవైపు మద్యం, నిద్రలేమీ లాంటివి కూడా భారీ ప్రమాదా లకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించి హైవేల్లో వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య అధికం గా ఉన్నా దానిని నియంత్రించేందుకు పోలీస్, రవాణా శాఖ లు పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపి స్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు పూర్తిగా తగ్గిపోవడంతో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రమా దాలు జరిగిన సమయంలో స్పష్టమవుతోంది. ఈ ప్రమాదాల తీవ్ర త పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మరింత పటిష్టంగా నిబంధనలను అమలు చేసే విధంగా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరిగేలా చూడాలన్న విజ్ఞప్తులు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.