బండి ఆత్మకూరు, జూన్ 6 (ప్రభ న్యూస్) : కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దీంతో బండి ఆత్మకూరు గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారందరూ నంద్యాల జిల్లా వెలుగోడు, బండి ఆత్మకూరు మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. బాధితులందరూ కర్ణాటక రాష్ట్రంలోని కలుబుగిరి దర్గాలో ఉరుసు జాతరకు వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మండల కేంద్రమైన బండి ఆత్మకూరులో తీవ్ర విషాదం నెలకొంది.
కాగా ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రి, కొడుకులు ఇద్దరూ దుర్మరణం చెందారు. తండ్రి మునీర్ 40, కుమారుడు ముద్దత్ షిర్ 12, మృతిచెందగా మునీర్ భార్య నజియా భాను తీవ్ర గాయాలపాలైందని వారి బందువులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో వారి బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో వారితో పాటు వారి సమీప బంధువులు వెలుగోడు మండలానికి చెందిన నయామత్ 40, రమీజా బేగం 50, సుమ్మి 13 అనే ముగ్గురు మృతిచెందగా, మరో 12 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను అక్కడి స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరందరూ బంధువులు కావడంతో అందరు కలిసి తూఫాన్ వాహనంలో దైవ దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తెల్లవారుజామునే వారి మరణ వార్త అందరినీ కలిచి వేసింది.