Thursday, November 21, 2024

ఏపీలో మళ్లీ పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో విద్యుత్‌ వినియోగం మళ్లీ క్రమంగా పెరుగు తోంది. అసని తుపాను ప్రభావంతో తగ్గిన డిమాండ్‌.. మళ్లీ పెరుగుతోంది. విద్యుత్‌ డిమాండ్‌ గత నెలతో పోలిస్తే ప్రస్తుతం భారీగా తగ్గింది. ఏప్రిల్‌లో అత్యధికంగా రోజుకు 235 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) వరకూ చేరిన వినియోగం కొద్ది రోజుల క్రితం అసని తుఫాను ప్రభావం వల్ల తగ్గుముఖం పట్టింది. వాతావరణం చల్లబడ టంతో ఈ నెల 11వ తేదీన 151.43 మిలియన్‌ యూనిట్లకు తగ్గింది. దీంతో వ్యవసాయ, గృహ విద్యుత్‌ వినియోగదారులకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ అందిస్తూనే, పరిశ్రమలపై ఉన్న ఆంక్షలను దాదాపు ఎత్తేశారు. కానీ అంతలోనే విద్యుత్‌ డిమాండ్‌ పెరగడం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 172.86 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరుగుతోంది. అందుబాటులో 208.63 మిలియన్‌ యూనిట్లు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల నుంచి జరుగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి డిమాండ్‌ కంటే ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఏపీ జెన్‌కో థర్మల్‌ కేంద్రాల నుంచి 78.45 ఎంయూ, ప్రైవేటు థర్మల్‌ కేంద్రాల నుంచి 10.75 ఎంయూ, సెంట్రల్‌ గ్యాస్‌ స్టేషన్లు నుంచి 39.62 ఎంయూ, హైడ్రో స్టేషన్ల నుంచి 5.48 ఎంయూ, ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌ (ఐపీపీ) నుంచి 8.74 ఎంయూ, పవన విద్యుత్‌ 27.85 ఎంయూ, సౌర విద్యుత్‌ 17.65 ఎంయూ సమకూరుతోంది. 20.09 ఎంయూ బయటి నుంచి కొన్నారు. మొత్తం 208.63 ఎంయూ అందుబాటులో ఉంది. ప్రస్తుత వినియోగం 172.86 ఎంయూ మాత్రమే ఉంది. దీంతో ఒప్పందాల మేరకు సుమారు 35 ఎంయూను ఇతరులకు విక్రయించారు. మళ్లీ విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుండటంతో మరికొద్ది రోజులు జాగ్రత్త అవసరమని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు.

కొనుగోలుకు రూ.2,687.81 కోట్లు ఖర్చు..

దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడ్డ విద్యుత్‌ కొరతకు ఏప్రిల్‌ ప్రారంభంలో రాష్ట్రంలో అత్యధిక డిమాండ్‌ తోడైంది. ఫలితంగా కొద్ది రోజు లు వినియోగ దారులు విద్యుత్‌ కోతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించింది. పరిశ్రమల విద్యుత్‌ వినియోగంపై ఆంక్షలు విధించింది. గృహాలు, వ్యవసాయానికి ఆటంకం లేకుండా సరఫరా చేసింది. ఇందుకోసం మొదట్లో బహిరంగ మార్కెట్‌లో రోజుకు సుమారు రూ.70 కోట్లు, ఆ తరువాత రోజుకి రూ.40 కోట్లు వెచ్చించి విద్యుత్‌ కొనుగోలు చేసింది. మార్చి నుంచి ఇప్పటివరకూ బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోళ్లకే రూ.2,687.81 కోట్లు వెచ్చించింది. ఫలితంగా నేటికీ ఉత్తరప్రదేశ్‌లో రోజుకు 1.34 ఎంయూ, బీహార్‌లో 1.44 ఎంయూ, జార్ఖండ్‌లో 2.03 ఎంయూ, రాజస్థాన్‌లో 0.65 ఎంయూ కొరత ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement