Sunday, November 17, 2024

RIP – ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ఆంధ్రప్రభ స్మార్ట్ – ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచారు.

భరతనాట్యం, కూచిపూడి నృత్యరీతుల్లో యామినీ కృష్ణమూర్తి విశేష పేరుప్రఖ్యాతులు పొందారు. ఆమె 1940లో మదనపల్లెలో జన్మించారు. ప్రఖ్యాత నృత్యకారిణి, గురువు రుక్మిణీ దేవి అరుండేల్ వద్ద శిష్యరికం చేశారు. 1957లో చెన్నైలో తన మొదటి నాట్య ప్రదర్శన ఇచ్చారు. 1968లో పద్మశ్రీ, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2016లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. యామినీ కృష్ణమూర్తి టీటీడీ ఆస్థాన నాట్యకళాకారిణిగానూ సేవలు అందించారు. ఆమె ఒడిస్సీ నృత్యరీతిలోనూ ప్రావీణ్యం సంపాదించడం విశేషం.

- Advertisement -

చంద్రబాబు సంతాపం

భారత దేశం గర్వించదగిన నృత్యకారిణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందాను. 1940లో మదనపల్లెలో జన్మించిన ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన నర్తకిగా పని చేశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టింది కూడా యామినీ కృష్ణమూర్తి గారే. ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. – చంద్ర బాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement