హైదరాబాద్ – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు నేడు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా . అనారోగ్యంతో బాధపడుతున్నారు.. దీంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. నారా రామ్మూర్తినాయుడు 1952లో నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో రోహిత్ కాగా.. మరొకరు నారా గిరీష్. రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు రామ్మూర్తి నాయుడు.
కాగా, మరణించిన సమయంలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ , చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అక్కడే ఉన్నారు. నేటి ఉదయమే తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. అనంతరం అయన అక్కడ నుంచే నేరుగా ఎఐజి హాస్పటల్ కు వెళ్లారు.
ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి నేడు వెళ్లవలసి ఉంది.. సోదరుడి మరణ వార్త తెలియడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీ నేరుగా విమాానంలో హైదరాబాద్ కు చంద్రబాబు బయలుదేరనున్నారు.