Friday, November 22, 2024

AP: వైద్యరంగంలో విప్లమాత్మక మార్పులు.. ఎంపీ ప్రసాదరావు

చిత్తూరు, ఆగస్టు 28 (ప్రభ న్యూస్ బ్యూరో) : రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గు మళ్ళ ప్రసాదరావు తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… జీవన ప్రమాణాలు పెరుగుదలకు వైద్య సదుపాయాలు పెరగాలన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైద్య రంగంలో పెను మార్పులు రానున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతంలో సైతం అన్ని జబ్బులకు వైద్యం అందించే విధంగా చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాదమరిలో అన్ని సదుపాయాలతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు సీఆర్ రాజన్, తదితర నేతలు, అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement