Friday, November 22, 2024

పల్లె రోడ్లకు పునరుజ్జీవం, 157 నియోజకవర్గాల్లో రహదారులకు రిపేర్లు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పునర్మిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారించింది. దెబ్బతిన్న రోడ్లకు పునరుజ్జీవం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 157 అసెంబ్లి నియోజకవర్గాల పరిధలో రోడ్ల అభివృద్ధికి ఆమోదముద్రవేసి రూ. వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పనుల వారీగా ప్యాకేజీలు నిర్ణయించి టెండర్లు పిలిచేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. దీనిలో భాగంగా పంచాయతీరాజ్‌ పరిధిలో మొత్తం 1845 రోడ్లను మొదటి దశలో మరమ్మతులు, పూర్తిస్థాయిలో నిర్మాణానికి ఆదేశాలు జారీచేసింది. మొత్తం మూడు విభాగాలుగా పనులను విభజించి ప్యాకేజీలు నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంచనాలను అధికార యంత్రాంగం రూపొందించి పనులు ప్రారంభించేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 157 అసెంబ్లి నియోజకవర్గాల్లో మూడు విభాగాలుగా పనులు చేపట్టనున్నారు. కొంతమేరకు దెబ్బతిన్న రహదారులకు ఒక ప్యాకేజీ, కొంత తీవ్రంగా దెబ్బతిన్న రహదారులకు మరో ప్యాకేజీ, పూర్తిగా ధ్వంసమైన రహదారులకు మరో ప్యాకేజీ అధికారులు రూపొందించారు. ప్రస్తుతం 194 కీ.మీ. మేర రహదారుల్లో గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టనున్నారు.

అలాగే మరో 1973 కీ.మీ. మేర గుంతలను పూడ్చడంతోపాటు సింగిల్‌ లేయర్‌ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పూర్తిగా ధ్వంసమైన 2,469 కీ.మీ. మేర రహదారులను పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ 2,469 కీమీ మేర రహదారులను పూర్తిగా తవ్వి లేయర్ల వారీగా బలమైన రహదారిని నిర్మించనున్నారు. ఈపనులన్నీ పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చూడాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రూ. 5 కోట్ల లోపు ఉన్న రహదారుల పనులను ఒక ప్యాకేజీగా విభజించారు. రూ. 5 కోట్లకుపైగా మరమ్మతులు చేపట్టాల్సిన రహదారులను ఇంకో ప్యాకేజీగా విభజించారు. జిల్లాల వారీగా పనుల ఆధారంగా ఈప్యాకేజీలను నిర్ణయించారు. మొత్తం 272 ప్యాకేజీలుగా విభజించి 1845 రోడ్ల పనులను చేపట్టనున్నారు.

ప్యాకేజీల వారీగా పరిశీలించినట్లయితే నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లిd నియోజకవర్గాల్లో 146 పనులను 29 ప్యాకేజీలుగా విభజించారు. ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ప్యాకేజీల విభజన జరిగింది. విశాఖపట్టణం జిల్లాలో అత్యల్పంగా 11 ప్యాకేజీలుగా విభజించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 66, విజయనగరంలో 121, పార్వతీపురం 54, అనకాపల్లిలో 51, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 37, కాకినాడలో 69, తూర్పు గోదావరిలో 72, కోనసీమ జిల్లాలో 99, పశ్చిమ గోదావరిలో 66, ఏలూరులో 103, కృష్ణాలో 104, ఎన్టీఆర్‌ జిల్లాలో 47, గుంటూరులో 66, పల్నాడు 64, బాపట్ల 64, ప్రకాశం 70, తిరుపతి 98, చిత్తూరు 98, కడప 48, అన్నమయ్య 80, కర్నూలు 60, నంద్యాల 39, సత్యసాయి 47, అనంతపురం 65 వంతున ప్యాకేజీలు కేటాయించి పనులు విభజించారు.

20వ తేదీన‌ టెండర్లు :
గ్రామీణ రహదారుల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ గురువారం అర్ధరాత్రి నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం శరవేగంగా నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర యంత్రాంగం సమీక్షలు నిర్వహిస్తూ టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈపనులన్నీ పంచాయతీరాజ్‌ పరిధిలో ఉన్నప్పటికీ రహదారులు, భవనాల శాఖతో కలిసి చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement