రాజకీయాలకు తావివ్వొద్దు
తిరుమల పేరు గుర్తుకు వస్తే.. ఏడుకొండల వైభవం చర్చకు రావాలి
ప్రతి భక్తుడి అభిప్రాయం తీసుకుందాం
ప్రతి ఆలయంలోనూ అమలు చేయండి
ప్రసాదం నాణ్యత పెరిగింది
తాగునీటి అవసరాలను గుర్తించండి
వీఐపీ హడావిడి తగ్గించండి
( ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుమల) తిరుమల పవిత్రతను, నమ్మకాన్ని కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు తిరుమలలో ఆయన పర్యటించారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షజరిపారు.
మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల పవిత్రతను కాపాడే అంశంలో సీఎం సూచనలు చేశారు. తిరుమల కొండపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావివ్వొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకోవాలని ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని ఆదేశించారు. భక్తుల సూచనల ఆధారంగా టీటీడీ సేవలు అందించాలన్నారు. ఒక్క టీటీడీ లోనే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తుల నుంచి సూచనలు తీసుకోవాలని మంత్రి ఆనం కి సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని ఇదే విధానం ఎల్లప్పుడూ కొనసాగాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని సూచించారు. తిరుమల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. భవిష్యత్ నీటి అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పైగా పెంచాలన్నారు. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలన్నారు. బయో డైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వీఐపీ హడావిడి తగ్గాల్సిందే..
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని అధికారులకు సీఎం సూచించారు. కొండపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి తప్ప హంగూ ఆర్భాటం, అనవసర వ్యయం వద్దన్నారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని, దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చేవారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
భక్తులు సంతృప్తితో, ఆధ్యాత్మిక అనుభూతితో తిరుమల పర్యటన ముగించుకుని వెళ్లాలనే రీతిలో టీటీడీ చర్యలు ఉండాలని సూచించారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలన్నారు. తిరుమల పేరు తలిస్తే….ఏడుకొండల వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలి. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ (స్వచ్చంద సేవను )మరింత బలోపేతం చేయాలి. తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
రివర్స్ టెండర్స్ రద్దు….
గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈఓ శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.