Monday, December 9, 2024

AP | భూవివాద ర‌హిత గ్రామాలు ల‌క్ష్యంగా రెవెన్యూ స‌ద‌స్సులు.. క‌లెక్ట‌ర్ డా.ల‌క్ష్మీశ‌

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : రాష్ట్ర ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని ఈనెల 6వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ‌ర‌కు రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆధ్వ‌ర్యంలో రెవెన్యూ స‌ద‌స్సుల‌పై ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులతో స‌మ‌న్వ‌య‌, స‌న్న‌ద్ధ‌త స‌మావేశం జ‌రిగింది.

ఈ స‌మావేశానికి జాయింట్ క‌లెక్ట‌ర్ డా.నిధి మీనా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, తిరువూరు శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, కొలిక‌పూడి శ్రీనివాస‌రావు, ప్ర‌త్యేక అధికారులు, త‌హ‌శీల్దార్లు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా రెవెన్యూ స‌ద‌స్సుల‌ను విజ‌య‌వంతం చేసేందుకు సిద్ధ‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, వివిధ శాఖ‌ల అధికారుల ప్ర‌త్యేక బృందాలు త‌దిత‌రాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు.

అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా మీడియాతో మాట్లాడుతూ… అధికారుల బృందాలే గ్రామాల‌ను సంద‌ర్శించి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి రెవెన్యూ, భూ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించే ల‌క్ష్యంతో రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. దీర్ఘ‌కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న సమ‌స్య‌ల‌కూ, కోర్టు కేసుల‌కు ప‌రిష్కారం చూపేలా స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఇప్ప‌టికే ప‌రిష్క‌రించిన స‌మ‌స్య‌ల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించి, ఫీడ్‌బ్యాక్ తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని, అవ‌స‌ర‌మైతే పునఃప‌రిశీల‌న చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

- Advertisement -

నిర్దేశ షెడ్యూల్ ప్ర‌కారం త‌హ‌శీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌, వీఆర్‌వో, మండ‌ల స‌ర్వేయ‌ర్‌, రిజిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్ ప్ర‌తినిధితో పాటు అవ‌స‌రం మేర‌కు అట‌వీ, దేవాదాయ శాఖ‌ల అధికారులు కూడా గ్రామానికి వెళ‌తార‌న్నారు. ఏ రోజు ఏ గ్రామంలో స‌ద‌స్సు జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని గ్రామపంచాయ‌తీ, టాం టాం, క‌ర‌ప‌త్రాలు త‌దిత‌రాల ద్వారా ముందే తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అన్ని పిటిష‌న్ల‌ను ఆన్‌లైన్లో రిజిస్ట‌ర్ చేసి, నిర్దేశ స‌మ‌యంలోగా ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌ద‌స్సుల‌ను అత్యంత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించి జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో అధికార యంత్రాంగం కృషిచేస్తుంద‌ని క‌లెక్ట‌ర్ లక్ష్మీశ తెలిపారు.

ఇదో గొప్ప కార్య‌క్ర‌మం..
విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ప్ర‌జ‌ల భూ స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం చూపే ల‌క్ష్యంతో కూట‌మి ప్ర‌భుత్వం రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని, ఇదో గొప్ప కార్య‌క్రమ‌మ‌ని పేర్కొన్నారు. ఈ స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన విధివిధానాల‌ను ఖ‌రారుచేసింద‌ని, స‌ద‌స్సుల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. గ‌తంలో రీ స‌ర్వే పేరిట జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కొన్ని కొత్త స‌మ‌స్య‌లు ఎదురై ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. వాటికి కూడా ఈ స‌ద‌స్సుల్లో ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు.

అత్యంత పార‌దర్శ‌కంగా స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌…

రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత పార‌ద‌ర్శ‌కంగా గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తోంద‌ని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు. రైత్వారీ ప‌ట్టాభూమి అయినా సెక్ష‌న్ 22 (ఏ)లో ఉండ‌టం వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. ఇలాంటి వాటికి స‌ద‌స్సుల్లో సంతృప్తిక‌ర ప‌రిష్కారం ల‌భించ‌నుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ గొప్ప ఉద్దేశంతో నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సుల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, విజ‌య‌వాడ‌, తిరువూరు, నందిగామ ఆర్‌డీవోలు కావూరి చైత‌న్య‌, కె.మాధురి, కె.బాల‌కృష్ణ, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ప్ర‌త్యేక అధికారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు సంతృప్తిక‌ర ప‌రిష్కారం…
రెవెన్యూ స‌ద‌స్సుల‌పై జ‌రిగిన స‌మ‌న్వ‌య స‌మావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రై మాట్లాడారు. ప్ర‌జ‌ల భూ స‌మ‌స్య‌ల‌కు సంతృప్తిక‌ర ప‌రిష్కారం చూపేందుకు కూట‌మి ప్ర‌భుత్వం రెవెన్యూ స‌ద‌స్సుల‌కు రూప‌క‌ల్ప‌న చేసింద‌ని తెలిపారు. ప్ర‌జ‌లు ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా అధికారులే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి రెవెన్యూ, భూ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా అధికారులు కృషిచేయాల‌న్నారు. ఇంత‌మంచి కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా స‌మావేశానికి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రైన జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ తాత‌య్య మాట్లాడుతూ… రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను పార‌ద‌ర్శ‌క‌త‌తో, జ‌వాబుదారీత‌నంతో ప‌రిష్క‌రించేలా క‌లిసిక‌ట్టుగా కృషిచేద్దామ‌ని.. త‌ప్పుల‌ను స‌రిచేసే క్ర‌మంలో కొత్త త‌ప్పులు జ‌ర‌క్కుండా చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement