గ్రామస్థాయిలో భూ వివాదాలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూ వివాదాలను తగ్గించేందుకు రెవెన్యూ కౌన్సిల్‌లు ఉండాలని, ఆక్రమణలో భూములు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించింది.
ఈ రెవెన్యూ సదస్సులను డిసెంబరు 6 – జనవరి 8 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఈనెల 5 నుంచి గ్రామస్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని, సదస్సు నిర్వహణకు ముందే సదరు గ్రామానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీజీఎస్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి పిటిషన్లు, అర్జీలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 22ఏ, ఫ్రీహోల్డ్, భూ ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కాగా, భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుము వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.