ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యా శాఖ సలహాదారుగా ఉన్న తెలంగాణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.మురళి తన పదవికి ఇవ్వాల (శుక్రవారం) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే పలువురు వ్యక్తులను సలహదారులుగా నియమించుకుంది. వీరిలో పలువురు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇట్లా తెలంగాణకు చెందిన మురళి ఏపీ విద్యా శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. గడచిన మూడేళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.
అయితే.. ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి తాను ఎందుకు రాజీనామా చేస్తున్నానన్న విషయాన్ని జగన్‌కు రాసిన లేఖలో మురళి వివరించారు. తన సొంత రాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆ పరిస్థితులను మెరుగుపరచేందుకే తాను సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన సేవలు ఇప్పుడు ఏపీ కంటే తన సొంత రాష్ట్రానికే అవసరమని తాను భావిస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు.