నెల్లూరు, ప్రభన్యూస్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో 2019లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి పలు సంస్కరణలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మనబడి నాడు – నేడు కార్యక్రమంతో విద్యా వ్యవస్థకు సంబంధించి పాఠశాలలు రూపురేఖలు మార్చుకున్నాయి. అదే విధంగా ప్రజల ముంగిట పరిపాలనలో భాగంగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 650కు పైగా గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో 250కు పైగా వార్డు సచివాలయాలు మొత్తం 900కు పైగా సచివాలయాలు ఏర్పడ్డాయి. తాజాగా ఏర్పాటు చేసిన సమయంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లో , పంచా యతీ కార్యాలయాల్లో సచివాలయాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటికీ నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం .. అందుకోసం ఆయా గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి చేసి పలు చోట్ల భవన నిర్మాణాలు కూడా ప్రారంభించడం జరి గింది. దీంతో పాటు ప్రతి గ్రామంలోనూ ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్‌లు , రైతులకు అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు నూతన భవనాలు , అలాగే వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలతో పా టు గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు అండగా నిలిచేలా బల్క్ మిల్క్ కలెక్షన్ యూ నిట్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది .
భవన నిర్మాణాల పనుల పురోగతి ఇలా ..
గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి జిల్లాలో రూ. 251 కోట్ల వ్యయంతో 659 భవనాల నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరిగింది. ఇందులో 289 భవనాలు పూర్తి కాగా , 364 భవనాలు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ. 114.51 కో ట్లు ఖర్చు చేయడం జరిగింది. ఆరు భవనాల పనులు ప్రారంభించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు సత్వరమే అందేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినా .. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు సంబంధించి రూ. 98 కోట్ల వ్యయంతో 547 భవనాల నిర్మాణానికి మంజూరు లభించగా, ఇప్పటి వరకు 84 భవనాల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 459 భవనాల నిర్మాణం పురోగతిలో ఉంది. అందుకు రూ. 29.74 కోట్లు ఖర్చు చేశారు. నాలుగు పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇక రైతులకు అండగా నిలుస్తున్న రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి 656 భవనాల నిర్మాణానికి రూ. 143. 90 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 177 భవనాల నిర్మాణం పూర్తి కాగా , 473 పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 49. 69 కోట్లు ఖర్చు చేయగా , ఆరు పనులు ప్రారంభించాల్సి ఉంది. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి జిల్లాలో 378 భవనాల నిర్మాణానికి రూ. 61 కోట్ల వ్యయంతో మంజూరు లభించగా , 367 పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 5 లక్షలు ఖర్చు చేయగా , 11 పనులు మొదలుపెట్టాల్సి ఉంది. ఇక పాడి రైతులకు అండగా నిలవనున్న బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల నిర్మాణం మొదటి దశకు సంబంధించి 163 భవనాలు రూ. 98 కోట్ల వ్యయంతో నిర్మించాలని మంజూరు ఇచ్చారు. నాలుగు భవనాలు పూర్తి కాగా, 159 పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.9.57 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
నిర్దేశిత సమయంలో భవన నిర్మాణాలన్నీ పూర్తి చేస్తాం
జిల్లాలో పలు కారణాల వలన ఆగిన భవన నిర్మాణాలన్నీ నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సుబ్రమణ్యం ఆంధ్రప్రభకు తెలియజేశారు. కొవిడ్‌తో సహా ఎన్నికల కోడ్ , సీఎఫ్‌ఎంఎస్ , తదితర సాంకేతిక కారణాలతో ఇటీవల బిల్లుల చెల్లింపు కొంత ఆలస్యం అయినప్పటికీ తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు తెలిపారు. రావాల్సిన నిధులను కూడా రాగానే చెల్లింపు చేస్తామని చెప్పిన ఆయన సరైన సమయంలోనే భవన నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..