అమరావతి, ఆంధ్రప్రభ : కందిపప్పు, మినపపప్పు ధరలు రెండు నెలల వ్యవధిలో పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. పరిమితికి మించి సరకు నిల్వ చేసిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు గజిట్ జారీచేసింది. కందిపప్పు, మినపపప్పుతోపాటు గోధుమల నిల్వపై కొత్తగా జారీచేసిన నిబంధనలు అమలుచేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల హోల్ సేల్ వ్యాపారులతో పౌరసరఫరాల సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో కందిపప్పు, మినపపప్పు వినియోగంపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో రోజుకు 20 టన్నుల కందిపప్పు, 50 టన్నుల మినపపప్పు వినియోగం అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో నాగపూర్ రకం కందిపప్పు కిలో రూ.150, ఇతర రకాలు రూ.137 నుంచి రూ.140, మిననపప్పు తెనాలి రకం రూ.115, ఇతర రకాలు రూ.97 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కందిపప్పు, మినపపప్పు దిగుబడి తగ్గడంతో ఇతర రాష్ట్రాల్రు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరిగాయి. పెరిగాయన్నారు.
దీంతో వీటి నిల్వలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హోల్సేల్ వ్యాపారి వద్ద కందిపప్పు, మినపపప్పు 200 టన్నులు, రిటైలర్ వద్ద ఐదు టన్నులు, అదేవిధంగా గోధుమలు హోల్సేల్ వ్యాపారి వద్ద 300 టన్నులు, రిటైలర్ వద్ద పది టన్నులు వరకు నిల్వ చేసుకోవచ్చు. అంతకు మించి ఉంటే సదరు వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కందిపప్పు, మినపపప్పు విక్రయించే హోల్సేల్ వ్యాపారుల గోదాములు కూడా తనిఖీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు