అమరావతి, ఆంధ్రప్రభ : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) గోదాముల్లో ఆహార ధాన్యాల నిల్వలు తగ్గముఖం పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా యధేచ్ఛగా సాగుతున్న ఆహారధాన్యాల విదేశీ ఎగుమతులపై ఆంక్షలతో పాటు భారీ సుంకాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరభారతంలో ఎక్కువగా వినియోగించే గోధుమలు, గోధుమాధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఇప్పటికే ఆంక్షలు విధించిన కేంద్రం దక్షిణాది రాష్ట్రాల్ల్రో అధికంగా వినియోగించే బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ప్రీమియం ఆహారోత్పత్తుల జాబితాలో ఉన్న బాస్మతి బియ్యం మినహా మిగతా అన్ని రకాల రోజువారీ వినియోగ బియ్యం రకాలపై 20 శాతం ఎగుమతి పన్ను వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఎగుమతి బియ్యంలో ఉప్పుడు బియ్యానికి మాత్రం మినహాయింపునిచ్చింది. బియ్యం నూకల ఎగుమతులపై పూర్తిస్తాయిలో నిషేధం విధించింది. ఇప్పటికే ఎగుమతులకు సిద్ధమై లోడింగ్, రవాణా, నౌకాశ్రయాల వద్దకు చేరుకోవటం తదితర దశల్లో ఉన్న బియ్యానికి మాత్రం ఎగుమతి సుంకం నుంచి మినహాయించారు. ఎగుమతుల కోసం వివిధ దశల్లో సిద్ధమైన బియ్యానికి పన్ను నుంచి ఈనెల 15 వరకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది.
ఆ తరువాత ఎగుమతుల కోసం బియ్యం ఏ దశలో ఉన్నా 20 శాతం ఎగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఒక వైపు ఎఫ్.సి.ఐ గోదాముల్లో నిల్వల్లో తగ్గుదల కనబడటంతో పాటు దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి కూడా తగ్గే సూచనలు కనబడటంతో ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల ఎగుమతిపై ఆంక్షలు విధించినట్టు అధికారవర్గాల సమాచారం. దీనివల్ల గోదాముల్లో నిల్వలు పెరగటంతో పాటు దేశీయ మార్కెట్లో ఆహారోత్పత్తుల సరఫరా పెరిగి కొరత తీవ్రత తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో ప్రధాన ఆహారోత్పత్తులైన గోధుమ, బియ్యంల నిల్వలు 14 ఏళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయినట్టు- ఎఫ్.సి.ఐ అందించిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తరహా దిద్దుబటు చర్యలు చేపట్టినట్టు సమాచారం. నిల్వలు తగ్గుతున్న క్రమంలో చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేలా కొవిడ్ సంక్షౌభ సమయంలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకంపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.