Saturday, November 23, 2024

తిరుమ‌ల న‌డ‌క‌దారిలో ఆంక్ష‌లు ప్రారంభం .. జంతువుల‌కు ఆహారం వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు ..

తిరుమల: తిరుమ‌ల న‌డ‌క‌దారిలో ఆంక్ష‌ల‌ను నేటి నుంచి అమ‌లు చేస్తున్నారు.. భ‌క్తులు గుంపులు గుంపులుగా వెళ్లేలా నియంత్రిస్తున్నారు.. అలాగే పిల్ల‌ల‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల త‌ర్వాత కాలిబాట‌లో అనుమ‌తించ‌డం లేదు.. ఈ నేప‌థ్యంలో టిటిడి ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భక్తుల ప్రాణ రక్షణే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కనుమ రహదారుల్లో జంతువులకు ఆహారం పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్ల మార్గంలో చెత్త వేసే దుకాణాల యాజమానులపై చర్యలు ఉంటాయన్నారు. 30 మీటర్లు దూరం కనపడేలా మెట్ల మార్గంలో ఫోకస్‌ లైట్లతో పాటు 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. మెట్లమార్గంలో కంచె (ఫెన్సింగ్‌) ఏర్పాటుకు తితిదే సిద్ధంగా ఉందని.. ఈ మేరకు అటవీశాఖకు ప్రతిపాదనలు పెట్టామన్నారు. అయితే, ఏం చేయాలన్నా అటవీశాఖ ఆంక్షలు కఠినంగా ఉన్నాయన్నారు.

అలాగే మెట్ల మార్గంలో వచ్చే భక్తులను అప్రమత్తం చేయనున్నట్లు ఛైర్మన్‌ తెలిపారు. దారిపొడవునా సూచిక బోర్డులు, లఘుచిత్రాలు ప్రదర్శిస్తామన్నారు. 12 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతిస్తామని వివరించారు. పెద్దలకు రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు. కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. అటవీశాఖలో సిబ్బంది నియామకానికి అవసరమైన నిధులను తితిదే సమకూరుస్తుందని వివరించారు. దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులను కాలినడక మార్గంతో పాటు ఏ దారిలో వచ్చినా అనుమతిస్తామన్నారు.

కంచె వల్ల ఉపయోగం లేదు: శాంతిప్రియ

మరోవైపు తిరుమల నడకదారిలో వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ అదనపు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శాంతిప్రియ పాండే తెలిపారు. ఇవాళ పట్టుబడిన చిరుత డీఎన్‌ఏ, రక్తం, వెంట్రుకలు నమూనా సేకరించినట్లు వివరించారు. నమూనా ద్వారా అది మనిషిని తిన్నదా? లేదా? అని నిర్ధారిస్తామన్నారు. నడకదారిలో కంచె ఏర్పాటు కుదరదని.. దాని వల్ల ఉపయోగం లేదన్నారు. చెట్లను ఎక్కే చిరుత కంచెను సులువుగా దాటగలదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement