Tuesday, November 19, 2024

ధార్మిక పరిషత్‌ పునరుద్ధరణ.. కసరత్తు చేస్తున్న దేవాదాయశాఖ, 13ఏళ్ల తర్వాత మ‌ళ్లీ తెరపైకి

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ధార్మిక పరిషత్‌ పునరుద్ధరణకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. 13 ఏళ్ల తర్వాత తిరిగి ధార్మిక పరిషత్‌పై అధికారులు ఆలోచన చేస్తున్నారు. రూ.కోటి పైబడిన ఆలయాలకు ట్రస్టుబోర్డుల నియామకం, దేవాదాయశాఖ పరిష్కరించలేని అర్చకులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ధార్మిక పరిషత్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 33/2007 చట్ట సవరణలో భాగంగా దేవదాయశాఖ మంత్రి ఛైర్మన్‌గా, దేవాదాయశాఖ కమిషనర్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్న ధార్మిక బోర్డులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆడిటర్లు, పదవీ విరమణ చేసిన ఐఎఎస్‌ అధికారులతో పాటు ధార్మిక చింతన కలిగిన 20మంది ప్రముఖులతో ధార్మిక ట్రస్టు బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి దేవదాయశాఖ మంత్రి రత్నాకరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో ఉండేందుకు పీఠాధి, మఠాధి పతులు ఆసక్తి చూపకపోవడంతో ధార్మిక పరిషత్‌ ఏర్పాటు ప్రక్రియ అటకెక్కింది. తిరిగి మరోసారి ధార్మిక పరిషత్‌ అంశం తెరపైకి రావడంతో పలువురు ఆశావహుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

ప్రభుత్వం దృష్టి..

రాష్ట్రంలోని ఆలయాల్లో ధార్మిక చింతన నెలకొలిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆలయాల్లో పలు కార్యక్రమాలను చేపడుతోంది. ధర్మపథం వంటి పథకాలను తీసుకొచ్చి భక్తులను ఆలయాలకు చేరువ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు, అర్చకుల సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తోంది. అర్చకుల వేతనాలు కూడా పెంచి క్రమం తప్పకుండా చెల్లించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆలయాల్లో భక్తులకు అన్ని విధాల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రత్యేక పర్వదినాలు, ఉత్సవాల సమయంలో భక్తులను భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement