రాజమహేంద్రవరం, ప్రభన్యూస్: కాదేదీ వ్యాపారానికి అనర్హం. ఇప్పటి వరకు పలురకాల హోటల్స్ చూశాం.. తాజాగా కోచ్ హోటల్స్‌ను భారతీయ రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ ప్రయోగాన్ని దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. రెండేళ్ళ క్రితమే గుంతకల్లు రైల్వేస్టేషన్ ఆవరణలో ఓ కోచ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే దీనికి తగిన ఆదరణ దక్కలేదు. తిరిగి గుంటూరులో ఇప్పుడొక కోచ్ రెస్టారెంట్ ను నెలకొల్పింది. ఇందులో రోజురోజుకు వ్యాపారం పెరుగు తోంది. దీంతో త్వరలోనే విజయవాడలో కోచ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలెట్టింది. అలాగే రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరుల్లో కూడా కోచ్‌రెస్టారెంట్లను నెలకొల్ప నుంది.
చిన్నపిల్లల్నుంచి పెద్దల వరకు రైలెక్కడం అంటే చాలా సరదా. ఈ సరదానే రైల్వే వ్యాపార సూత్రంగా మార్చుకుంది. పాతికేళ్ళు నిండిన ఎసి బోగీలని రైల్వేలు తొలగించాలి. ఇంతవరకు ఇలా తొలగించిన బోగీల్లోని విడి సామాగ్రిని వేలం వేసి మిగిలిన భాగాల్ని తుక్కుగా అమ్మేసేది. కానీ ఇప్పుడు ఇలా పాతికేళ్ళు నిండిన ఎసి బోగీల్లోని సీట్లను తొలగించి బోగీనీ బోగీలాగే రైల్వేస్టేషన్ శివార్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పట్టాలపై పెట్టి రెస్టారెంట్లుగా మారుస్తోంది. దీని నిర్వహణను పబ్లిక్ ఆక్షన్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. ఈ బోగీలో వంటగదితో పాటు వచ్చే కస్టమర్ ్స కోసం అత్యాధునిక టేబుళ్ళు, కుర్చీలు ఏర్పాటు చేస్తోంది. అయితే ట్రాక్ నిర్మించడం, దానిపై బోగీల్ని పెట్టడం వరకే రైల్వేల బాధ్యత. తదుపరి ఏర్పాట్లన్నీ నిర్వహణా హక్కుపొందే ప్రైవేటు సంస్థలే చేసుకోవాలి. ఇందులో టిఫిన్లు, భోజనాలు, ఇతర ఆహార పదార్ధాల్ని అమ్ముకోవచ్చు. వీటి ధరల నిర్ణాయక హక్కు కూడా ప్రైవేటు సంస్థదే. ఈ తరహా కోచ్ రెస్టారెంట్‌కు గుంటూరులో మంచి ఆదరణ లభించింది. దీనివల్ల కాలం తీరిన ఎసి కోచ్‌ల నుండి కూడా రైల్వే అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే వెసులుబాటేర్పడింది.