న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మచిలీపట్టణం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును వెంటనే పునః ప్రారంభిచాలని వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన లోక్‌సభలో రూల్ 377 కింద తిరుపతి రైలు గురించి ప్రస్తావించారు. మచిలీపట్నం నుంచి తిరుపతి మీదుగా ధర్మవరం వెళ్లే రైలును రైల్వే బోర్డు రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. ప్రజల డిమాండ్ మేరకు 2007లో ప్రారంభమైన ఈ ట్రైన్ మచిలీపట్నం, పరిసర ప్రాంతవాసుల రవాణా అవసరాలను తీరుస్తోందని బాలశౌరి వివరించారు. ప్రస్తుతం ఒక ఎక్స్‌ప్రెస్ నర్సాపురం నుంచి తిరుపతి మీదుగా ధర్మవరం వెళుతోందని, గుడివాడ వద్ద మచిలీపట్నం పరిసర ప్రాంతాల ప్రయాణికులను ఎక్కించుకుంటోందని చెప్పారు.
ఈ రైలుకు అనుసంధానంగా ఒక ప్యాసింజర్ రైలును మచిలీపట్నం నుంచి గుడివాడకు నడుపుతున్నారని, దీనివల్ల తిరుపతి వెళ్ళే భక్తులతో పాటు వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం నుంచి తిరుపతి మీదుగా ధర్మవరం వెళ్ళే రైలును రద్దు చేయడం వల్లే ప్రయాణికులు ప్రయాసపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాబట్టి రద్దు చేసిన ఎక్స్‌ప్రెస్ రైలును భక్తుల మనోభావాలు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే పునః ప్రారంభిచాలని ఎంపీ బాలశౌరి రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..