గుంటూరు : నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గుంటూరు జిల్లా దాచేపల్లి కి వెళ్లిన తెలంగాణ పోలీసులపై నిందితులు, వారి మద్దతు దారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన పోలీసులు దాచేపల్లి స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి స్టేషన్ కు సంబంధించిన ఎస్.ఐ, ఏఎస్ ఐ , ఇద్దరు కానిస్టేబుల్స్ నిన్న రాత్రి దాచేపల్లి లోని రేషన్ మాఫియాకు చెందిన బొమ్మిరెడ్డి శ్రీనివాస్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు.
నిందితుడిని పట్టుకుని వారి కారులో ఎక్కించుకొని వెళ్తున్న సమయంలో బొమ్మిరెడ్డి శ్రీనివాస్ రావు అనుచరులు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు , బొమ్మిరెడ్డి అనుచరులకు తీవ్ర వాదోపవాదాలు, తోపులాట జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ పోలీసుల కారు అద్దాలు ధ్వంసం అయినట్లు సమాచారం. తమపై కూడా సుమారు 20 మంది దాడి చేశారని తెలంగాణ పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి రేషన్ మాఫియాకి తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిందని, బొమ్మిరెడ్డి శ్రీనివాసరావు బొమ్మిరెడ్డి నాగరాజు తో పాటుగా మరో 20 మంది పై ఫిర్యాదు చేసినట్లు దాచేపల్లి పోలీసులు తెలిపారు. కాగా సూర్యాపేట జిల్లా ,గరిడేపల్లి స్టేషన్ పరిధిలో బొమ్మిరెడ్డి శ్రీనివాస్ పై రేషన్ మాఫియా సంబంధించి గతంలో పలు కేసులు నమోదయ్యాయి. రాత్రి కూడా ఆ కేసుల నిమిత్తం పట్టుకోవడానికి తెలంగాణ నుండి వచ్చినట్లు తెలుస్తుంది .