కర్నూలు, (ప్రభ న్యూస్) : జిల్లాలో జలాశయాలు అర్బన్ ప్రాంతాల చుట్టూ పెద్దపెద్ద కాల్వలు ఉన్నా తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి సమస్య పరిష్కరిస్తామంటూ నేతలు హామీలిస్తున్నారే తప్ప నీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. కర్నూలు నగరపాలకంలో 52 వార్డులు ఉండగా, 60వేల గృహాలకు 2021 జనాభా ప్రకారం 1.50 టీఎంసీలు అవసరం కాగా ప్రస్తుతం 77.70 ఎంఎల్డి నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. జనాభా పెరుగుతున్నా అందుకు అనుగుణంగా నీటి సరఫరా లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కర్నూలు నగరపాలక సంస్థలో కల్లూరు ఎస్టేట్, బాలాజీ నగర్, సంతోష్ నగర్, ఉల్చాల రోడ్డు, వీకర్‌సెక్షన్ కాలనీ, ప్రకాష్‌నగర్, జొహరాపురం, నంద్యాల చెక్‌పోస్ట్, మామిదాలపాడు, షరీన్‌నగర్, గీతాముఖర్జీ నగర్ తదితర ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీళ్లు సరఫరా అవుతున్నాయి.
ఈ నీటి కష్టాలపై ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో నగర మేయర్ బివై రామయ్య ప్రత్యేకంగా వినతిని అందజేశారు. సుంకేసుల నుండి ఎస్ఎస్ ట్యాంకు వరకు రూ.83కోట్లతో పైపులైన్ నిర్మాణం చేపట్టాలని పాలకవర్గం తీర్మాణించి సీఎంకు నివేధికలు తెలియజేసినా ఇప్పటివరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కర్నూలు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం కళ్లెదుట కెసి కెనాల్, తుంగభద్ర, హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వల నిండా నీరు ఉన్నా తమకు బిందె నీరు కూడా దొరకడం లేదని బాధను వ్యక్తపరుస్తున్నారు.
ఆదోని పురపాలక సంఘంలో మూడు రోజులకోసారి నీటి సరఫరా..
మొత్తం 2 లక్షల జనాభా ఉండగా, శివారు కాలనీవాసులు తాగునీటికి 9 రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. క్రాంతినగర్, మహాత్మగాంధీ, ఆర్టిసి కాలనీ, ప్రశాంత్‌నగర్, ఆర్ఆర్ లేబర్ కాలనీ, అమరావతినగర్ తదితర కాలనీల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం బసాపురం సమీపంలో ఉన్న ఎస్ఎస్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా అందిస్తున్నారు. బసాపురం ఎస్ఎస్ ట్యాంకు కట్ట నిర్వహణ లోపంతో దెబ్బతింది. రూ.1.79కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి పనులు చేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో 1.10లక్షల జనాభా ఉండగా 15వేల కుళాయి కనెక్షన్లకు నీటి అవసరం 110 ఎంఎల్డి కాగా, ప్రస్తుతం 75 ఎంఎల్డినే సరఫరా చేస్తున్నారు. వెంకటాపురం రోడ్డు, సాయినగర్, గణేష్‌కాలనీ, అయ్యప్పస్వామి గుడి ఏరియా, శివన్ననగర్, నక్కరామయ్య కొట్టాల, ఎల్లమ్మ బీడు, మునెప్ప నగర్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సమస్య అధికంగా ఉంది. ఎమ్మిగనూరు పట్టణ శివారు ప్రాంతంలో మంచినీటి సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా ఇప్పటివరకు పరిష్కారం చూపలేదు.
ఆత్మకూరు పట్టణంలో 65వేల జనాభా ఉండగా రోజువారి లక్ష్యం 40లక్షల లీటర్లకు గానూ 24 లక్షల లీటర్ల నీటిని 3,916 కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇక్కడ నీటి సమస్యకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా శాశ్వత పరిష్కారం చూపడం లేదు. వెలుగోడు జలాశయం నుండి నీటిని సరఫరా చేసేందుకు రూ.120కోట్లతో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పట్టణ వాసులకు మూడురోజులకోసారి నీటి సరఫరా చేస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు కాలనీలు, కొత్తగా ఏర్పడుతున్న ప్రాంతాలతో పాటు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ సకాలంలో మంచినీటి సరఫరా కాకపోవడంతో సైకిళ్లు, ఆటోలు, తోపుడుబండ్లపై దూర ప్రాంతాల నుండి బిందె నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో 2 మినహా అన్ని పురపాలక, నగరపాలక ప్రాంతాల్లో వేసవి నాటికి ఈ సమస్యను వందశాతం పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..