ఏర్పేడు ( రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : అంతరిక్ష పరిశోధనలకు చంద్రయాన్ చేపట్టినట్టే సముద్ర వనరుల అధ్యయనం, పరిరక్షణ, ఉత్పత్తుల ఆదాయం పెంపు మౌలిక లక్ష్యాలుగా మన దేశం వచ్చే ఏడాది సముద్రయాన్ చేపట్టనున్నట్టు కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్ వెల్లడించారు. ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ (ఐ ఎస్ టి ఎఫ్ ) తిరుపతి, ఐ ఐ టి తిరుపతి, విజ్ఞాన భారతి ల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఐ ఐ టి క్యాంపస్ లో నేషనల్ ఎస్ అండ్ టి సిస్టమ్స్ అనే అంశం పై జరిగిన సదస్సు లో ఆయన పాల్గొన్నారు
తొమ్మిది రాష్ట్రలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించి ఉన్న 7,500 కిలో మీటర్లకు విస్తరించి ఉన్న సముద్ర తీరంలో 212 చిన్న పెద్ద పోర్థుల ద్వారా ఏటా 4.4 మిలియన్ల ఆహార సేకరణ జరుగుతోందన్నారు. సముద్రం ద్వారా 4 శాతం జాతీయ ఆదాయం మాత్రం వస్తోందన్నారు. ఆ ఆదాయాన్ని రాబోయే కాలంలో 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో పలురకాల కృషి చేస్తున్నా మన్నారు. అందులో భాగంగా డీప్ ఓషన్ టెక్నాలజీ మిషన్లో భాగంగా సముద్ర వనరులు, సముద్ర గర్భంలోని జీవ వైవిద్యంపై అధ్యయనం చేసేందుకు సముద్రయాన్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
ముగ్గురు అక్వానాట్స్ తో ప్రయాణం చేయడానికి అనువైన జలాంతర్గామిని ఈ పరిశోధనకు సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్ రవిచంద్రన్ పేర్కొన్నారు. అంతేకాకుండా సముద్ర జల చరాలను గుర్తించడమే కాకుండా వాటి పరిరక్షణకు డీప్ సీ డ్రైవర్సిటీ పరిశోధన జరుగుతుందన్నారు. ఆయిల్ అండ్ గ్యాన్, మెటల్స్ వంటి సముద్ర ఆర్థిక వనరులను సమగ్రంగా గుర్తించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.
.విజ్ఞానభారతి డైరెక్టర్ జనరల్ త్రిస్టా ఠాకూర్ మాట్లాడుతూ ఐ ఎస్ ఎం ఆర్ ద్వారా నికోటిన్ లేని పోగాకు వంటి ప్రయోగాలను చేస్తున్నామని తెలిపారు. గౌరవ అతిథిగా విచ్చేసిన నీతి ఆయోగ్ మెంబర్, డాక్టర్ కే సారస్వత్ మాట్లాడుతూ, సమాజ స్థితి గతులను సైన్స్ మారుస్తుందన్నారు. స్థిరమైన సమాజం కోసం శాస్త్ర సాంకేతిక రంగాని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. టెక్నాలజీ ద్వారా సంపదను సృష్టించుకోవాలని సూచించారు.
. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ బికే దాస్ డీఆర్డీవో సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భారత రాడార్లు, ఆయుధాల సామర్థ్యాన్ని వివరిస్తూ టెక్నాలజీ వృద్ధి కోసం డీఆర్డీవో చేస్తున్న కృషిని వివరించారు.
శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను తయారు చేసిన నేపథ్యాన్ని వివరిస్తూ, కష్టాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సత్ఫలితాలను సాధిస్తారన్నారు.
.
తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ. తిరుపతి ఐఎస్ టీ ఎఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ డి నారాయణరావు కార్యదర్శి టి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు