విజయవాడ – వైసిపి అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో జైలు జీవితం గడుపతున్నాడు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ .. 2018 అక్టోబర్ 25న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై శ్రీను కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. నాలుగున్నర సంవత్సరాలుగా జైలులో ఉంటున్న అతడికి ఇప్పటికీ అతడికి బెయిల్ రాలేదు. కోడికత్తి కేసుపై గురువారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఎటువంటి కుట్ర లేదని విచారణ ముగించాలని ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్ షీటుపై వాదనలు జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు జన్నుపల్లి శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తనకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదని గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని… ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు ఇకనైనా విముక్తి కలిగించండి అంటూ వేడుకున్నాడు. తనపై నమోదు అయిన కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలని కోరాడు. తనకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు విన్నవించానని అయినా ఎటువంటి స్పందనా రాలేదని.. ఇటువంటి పరిస్థితుల్లో మీకు లేఖ రాస్తున్నానని పేర్కొన్నాడు. దీంతో శ్రీను తనకు ఇకనైనా విముక్తి కలిగించాలని కోరుతు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. కాగా, తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ గతంలో శ్రీను తల్లి సావిత్రమ్మ అప్పటి సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాసిన విషయాన్ని అతడి తరఫు న్యాయవాది అబ్దుస్ సలీం గుర్తు చేశారు. గతంలో శ్రీను రాసిన లేఖ తెలుగులో ఉన్నందున సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకే ఈ లేఖను ఇంగ్లీషులోకి అనువాదం చేసి పంపిస్తున్నామని తెలిపారు.