Tuesday, November 19, 2024

AP | రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థను సందర్శించిన ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు..

విజయవాడ, (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని ఉత్తరప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రాజెక్ట్ ఎక్సపర్ట్ చందర్ కాంత్, ప్రశాంత్ షాహి ఐటి ఎక్సపర్ట్ బుధవారం సందర్శించారు. వీరికి విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి అధికారులు ఏపీఎస్డీఎంఏకు వచ్చి ఇక్కడ జరుగుతున్న పనితీరును విశ్లేషించారు. గతంలో ఒడిశా, అస్సాం, ఉత్తరాఖండ్, తమిళనాడు, తెలంగాణ, డిల్లీ రాష్ట్రాల అధికారులు ఇక్కడకు వచ్చి విపత్తుల్లో ఏపీ అవలంబిస్తున్న విధివిధానాలు తెలుసుకున్నారు. ఏపీలో 44% తుపాను, 15% వరదలు, 68% కరువు, పిడుగులు, వడగాల్పులు 100 శాతం ప్రభావితం చేస్తున్నట్లు బృందానికి అంబేద్కర్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ప్రాజెక్ట్ ఎక్సపర్ట్ చందర్ కాంత్ మాట్లాడుతూ.. ఏపీ స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ అనుసరిస్తున్న నూతన విధివిధానాలు, కార్యచరణ తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. వాతావరణ పరిశోధన విభాగాలలోని వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తుందని తమ రాష్ట్రంలో ఇక్కడ సాంకేతికతను అమలు చేస్తామని తెలిపారు. విపత్తులను ఎదుర్కోడానికి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పాటిస్తున్న ఉత్తమ విధానాలు, కార్యచరణ ప్రణాళికలు, కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ ఉత్తరప్రదేశ్ అధికారులకు వివరించారు.

స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి 24 గంటలు పర్యవేక్షించే విధానం, వాతావరణం గురించి వివిధ మోడల్స్ క్రోడికరించి హెచ్చరికలు జిల్లాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. విపత్తుల సమయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్ పంపే విధానాన్ని చూపించారు. కామన్ అలెర్ట్ ప్రోటోకాల్ , ఏపీ అలెర్ట్ ద్వారా ప్రజలకు హెచ్చరిక మేసేజ్లు పంపించే విధానం చూపించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్ ఫోన్స్, శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్, వాకీటాకీ, వి-శాట్ కమ్యూనికేషన్ పరికరాలను ఉత్తరప్రదేశ్ అధికారులకు చూపించారు. వెబ్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ గురించి విపత్తుల సంస్థ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో విపత్తుల సంస్థ ఈడి డా.సి.నాగరాజు, రిటైర్డ్ సైంటిస్ట్ ఎమ్ ఎమ్ అలీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement