Saturday, November 23, 2024

AP | వర్షాల నష్టంపై నివేదికలివ్వండి : మంత్రి జనార్దన్ రెడ్డి

కర్నూలు బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 11,238 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, సంబంధిత అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, రోడ్లు, శిలాజ స్థితిలో ఉన్న‌ మట్టి మిద్దెలు, పారిశుద్ధ్య చర్యలు తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు.

వర్షాలు కొనసాగుతుండడంతో నష్టం తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున నష్టాన్ని అంచనా వేసి వాస్తవ నివేదికలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. పాములపాడు మండలం వేంపేట గ్రామంలో డయేరియా కేసులు పెరగకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు.

జిల్లాలోని కుందూ మద్దిలేరు, పాలేరు వాగుల ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పరివాహక ప్రాంతాల్లో నీట మునిగిన పంటల నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మట్టిమిద్దెలు ఉన్న గ్రామాల్లో ప్రాణనష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లపై జరిగిన నష్టం వివరాలను సేకరించి నివేదికలు అందజేయాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులను మంత్రి ఆదేశించారు. దోమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టి పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

- Advertisement -

రాష్ట్రంలో నెలకొన్న అకాల వర్షాలపై మంత్రి సమీక్ష

వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించి వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1000 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు నిర్ధారించినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. తీవ్ర వరద ప్రభావిత జిల్లాల్లో అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రవాణాకు అంతరాయం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వరద నష్టంపై ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదికలు ఇవ్వాలన్నారు. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో దెబ్బతిన్న వంతెనల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రత్యామ్నాయ మార్గాల కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement