Wednesday, November 20, 2024

ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ కు నివేదిక!

కరోనాకు విరుగుడుగా ఆనందయ్య తయారు చేసిన మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తి అయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీని ఆయుర్వేద వైద్యులు పూర్తి చేశారు. ఈ పరిశోధనల నివేదికను ఆన్‌లైన్‌లో సీసీఆర్ఏఎస్‌కు అందజేశారు. మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి రెండో దశ ప్రయోగాలు ప్రారంబించనున్నారు. టాక్సిక్ స్టడీ, జంతువులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య నాటు మందు హాట్‌ టాపిక్‌ గా మారింది.  జనం నుంచి అనూహ్య మద్దతు వస్తుండటంతో మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. ఐసీఎంఆర్ కూడా నివేదికను సిద్దం చేసే పనిలో ఉంది.

ప్రస్తుతం ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు దివ్య ఔషధంలా పనిచేస్తోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. దీంతో కరోనా బాధితులు వేల సంఖ్యలో కృష్ణపట్నంకు క్యూ కట్టారు. కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో లక్షలు ధారపోసినా ప్రయోజనం లేదని.. ఆనందయ్య కరోనా మందు తీసుకున్న కొందరు రోగులు చెప్పారు. దీంతో ఆనందయ్య మందుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆనందయ్య నాటు మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్ట రాకపోయినా.. ప్రజలు మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు. వేల సంఖ్యలో ఆ మందు కోసం ఎగబడుతున్నారు.

ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఆనందయ్య నాటు మందు ముందర తేలిపోతోందని ప్రజలు అంటున్నారు. ఆనందయ్య నాటు మందుపై ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయి నివేదిక‌లు వ‌చ్చే వ‌రకు ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement