(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ జరగలేదు. పార్టీ గెలుపు కోసం ఆరుగాలం కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు చకోర పక్షుల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు.
అధిష్టానం మాత్రం నేడు, రేపు అంటూ ఊరిస్తూనే ఉంది. దీంతో పార్టీ క్యాడర్ చాలా వరకు నిరాశకు గురవుతోంది. పార్టీ క్యాడర్ లో నూతన సంవత్సరం నూతన ఉత్సాహాన్ని నింపడానికి డిసెంబర్ 30 వ తేదీ లేదా సంక్రాంతి లోపు నామినేటెడ్ పదవుల పంపిణీ ఉంటుందని విశ్వసనీయంగా తెలుసింది.
దాదాపు 60 రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్, డైరక్టర్ల పదవుల జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటికే రెండు విడతలుగా 80 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించిన విషయం తెలిసిందే. అందులో కొన్నింటికి డైరెక్టర్ లను కూడ నియమించారు.
అలాగే మార్చిలో ఖాలీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు పట్ల ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో టిడిపికి అధిక స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. జనసేన, బిజెపి పార్టీలకు సముచిత స్థానాలు దక్కుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నేతలు కొందరికి రాష్ట్రంలో కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
మాజీ ఎమ్మెల్యేలు సి కి బాబు, ఎ ఎస్ మనోహర్ లలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అంటున్నారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో కీలకమైన కార్పోరేషన్ పదవి ఇస్తారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ కూడా రాష్ట్ర పదవుల రేస్ లో ఉన్నారు.
ఈ జాబితాలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధులైన డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్ కు పదవులు ఖాయమైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక జనసేన, బిజెపి నాయకులలో ఒకరిద్దరి రాష్ట్ర పదవులు దక్క వచ్చని సమాచారం. కొత్తగా భర్తీ కానున్న పదవులలో అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, ప్రణాళికా సంఘం, నెడ్ క్యాప్ చైర్మన్ వంటి వాటికి తీవ్ర స్థాయిలో పోటీ ఉందని చెబుతున్నారు.
అలాగే బేవరేజెస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్కాబ్, బ్యూటిఫికేషన్ గ్రీనరీ అండ్ కార్పొరేషన్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వాటితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా కీలకంగా ఉందని తెలిసింది. వీటికి తోడుగా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.
దీంతో ఈసారి వీలైనంతవరకూ పదవులు అన్నీ భర్తీ చేసి పార్టీ కోసం కష్టపడిన వారిని ప్రోత్సహించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడు నెలల కాలం గడచిపోయింది. దాంతో ఆశావహులను వేచి చూసేలా ఉంచడం మంచిది కాదని భావించే ఈ పదవుల పందేరానికి తెర తీస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ నెలాఖరు లేదా సంక్రాంతికి పదవుల పంపిణీ జరిగిపోతుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఇదిలా ఉండగా జిల్లాలోని కాణిపాకం ఆలయం, బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండళ్ల చైర్మన్, సభ్యులను నియమిస్తారని తెలిసింది. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇతర పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు.
చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సి కె బాబు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మాజీ ఎం ఎల్ సి దొరబాబు పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి కోదండయదవ్, కాజూరు బాలాజీ, వై వి.రాజేశ్వరి, చెరుకూరు వసంత కుమార్, గుడిపాలకు చెందిన బాలాజీ నాయుడు, యాదమరికి చెందిన ఆరని బాలాజీ, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
పూతలపట్టుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుష్పరాజ్ ఇటేవల చంద్రబాబును కలసి వచ్చారు. గుడిపాలకు చెందిన పీటర్, మాజీ ఎం ఎల్ ఏ గాంధీ, పుత్తూరుకు చెందిన గ్యాస్ రవికుమార్ కూడా పదవి ఆశిస్తున్నారు. బిజెపి నుండి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, బిసి నేత అట్లూరి శ్రీనివాసులు కూడా రేసులో ఉన్నారు.
పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో తలబడి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డికి పదవి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. జి. డి నెల్లూరు నియోజక వర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డితో పాటు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణలకు పదవీ యోగం ఉందంటున్నారు. నగరి నియోజకవర్గంలో మాధవ నాయుడు, పోతుగుంట విజయబాబు పదవులను ఆశిస్తున్నారు.
అయితే అక్కడ సిద్ధార్థ విద్యాసంస్థలు అధిపతి అశోక్ రాజుకు బిజెపి కోటాలో పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాయకులు అందరు చైర్మన్ పోస్టులపై దృష్టిని పెట్టారు. ఎం ఎల్ ఏ, ఎంపి సిఫారసు లేఖలను జత చేశారు. తనకు పదవి తప్పదని అందరు నాయకులు ధిమాతో ఉన్నారు. నూతన సంవత్సరం ఎవరికీ పదవులను మోసుకు వస్తుందో, ఎవరిని నిరాశకు గురిచేస్తుందొ కాలమే నిర్ణయించాలి.