Saturday, November 23, 2024

రేపే టెట్‌ నోటిఫికేషన్‌.. బీఈడీ, టీటీసీ పాసైన వారికి చాన్స్.. ఆగస్టులో పరీక్షలు?

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(టెట్‌) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకోసం శుక్రవారం నోటిఫికేషన్‌, ఇతర వివరాలు విడుదల కానున్నాయి. దాదాపు పది వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 2018లో చివరిసారి టెట్‌ నిర్వహించారు. అలాగే అదే ఏడాది డీఎస్సీని నిర్వహించి దాదాపు ఏడు వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామని, అందుకోసం టెట్‌, డీఎస్సీ వేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ప్రస్తుతం మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న డా. ఆదిమూలపు సురేష్‌ విద్యాశాఖ మంత్రిగా పని చేసినన్నాళ్లు డీఎస్సీ, టెట్‌ నిర్వహించబోతున్నామని అనేకసార్లు ప్రకటనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌లో ఉపాధ్యాయ పోస్టులు ప్రకటిస్తారని బీఈడీ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూసినా వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెట్‌ నిర్వహించబోతున్న సమాచారం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

దాదాపు 25 వేలకుపైగా పోస్టులు అవసరం..

రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టలేదు. దీంతో వందల సంఖ్యలో పాఠశాలలు ఏకోపాధ్యాయులతో కొనసాగుతున్నాయి. మరోవైపు నూతన జాతీయ విద్యావిధానం అమలుతో కిలోమీటర్‌ లోపున్న పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం, పలు ఎయిడెడ్‌ విద్యాసంస్థలను సిబ్బందితో సహా ప్రభుత్వంలోకి కలుపుకోవడం వంటి ప్రక్రియలతో కొన్ని పోస్టుల్లో సర్దుబాట్లు మాత్రమే జరిగాయి. ఈ నేపథ్యంలో దాదాపుగా 25 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పది వేల వరకు పోస్టుల కోసం టెట్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

20 శాతం వెయిటేజ్‌..

టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో 20 శాతం వెయిటేజ్‌ కల్పిస్తారు. అలాగే గతంలో టెట్‌ రాసి అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు చెల్లుబాటు అయ్యేది. అయితే ఒకసారి టెట్‌ రాసి అర్హత సాధిస్తే.. మరోసారి రాయాల్సిన అవసరం లేకుండా, జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా గతేడాది కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విడుదల కాబోయే టెట్‌ కోసం లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. అభ్యర్థులు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఉన్నా అక్కడ ఏర్పాటు చేసే పరీక్షా కేంద్రాల్లో రాసుకునే వెసులుబాటు కల్పించనుంది. టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఈ నెల 16వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని, ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వాలని, ఆగస్టు ఆరో తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం సెప్టెంబర్‌ 14న లేదా రెండో వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తోంది.

- Advertisement -

తెలంగాణలో ఇప్పటికే విడుదల

తెలంగాణలో టెట్‌ పరీక్ష ఈ నెల 12న జరగనుంది. ఆ రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఆరు లక్షల 26 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఏపీలో కూడా నాలుగేళ్ల తర్వాత విడుదల చేస్తున్న నోటిఫికేషన్‌ కావడంతో అంతకు మించి దరఖాస్తులు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో బైలింగ్వుల్‌(రెండు భాషల్లో) ప్రశ్నాపత్రాలు సిద్ధం చేసినట్లే.. ఏపీలో కూడా చేస్తారని తెలుస్తోంది.

రేపే విడుదల..

ఏపీ టెట్‌- 2022కు సంబంధించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేస్తామని పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ తెలిపారు. టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం, నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులిటెన్‌, సిలబస్‌, పరీక్షా తేదీలు, పరీక్షా రుసుము, ఆన్‌లైన్‌ పరీక్షల సూచనలు టెట్‌ వెబ్‌సైట్‌ ఏపీటీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌ లో శుక్రవారం ఉదయం పదిన్నర గంటల నుంచి అందుబాటులో ఉంటాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement