Thursday, December 12, 2024

AP | మంచినీటి పథకాల మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలి : మంత్రి టీజీ భరత్

కర్నూలు బ్యూరో : రక్షిత మంచినీటి పథకాల మరమ్మతు పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ నీటి సరఫరా-పారిశుద్ధ్యం,పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, విద్యుత్ శాఖ లపై సభ్యులు చర్చించారు..

గ్రామీణ నీటి సరఫరా శాఖ పై చర్చలో భాగంగా నందికొట్కూరు శాసనసభ్యులు సిపిడబ్ల్యుసి మరమ్మతు పనులకు సంబంధించిన టెండర్లపై మాట్లాడిన నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. టెండర్లలో 30-40 శాతం తక్కువ చేసి కోట్ చేస్తే మరమ్మతు పనులు ఏ విధంగా నాణ్యతతో చేస్తారని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని ప్రశ్నించారు.

20 శాతం తక్కువ చేసి కోట్ చేస్తేనే పనులు నాణ్యతతో ఉండవని, అలాంటిది సుమారు 40 శాతం మేరకు తక్కువ చేస్తే ఏ విధంగా పనులు నాణ్యతతో చేస్తారని అధికారులను ప్రశ్నించారు…రెండు నెలల నుంచి ఎమ్మెల్యే ఈ అంశంపై ప్రశ్నిస్తున్నా ఎందుకు చర్య తీసుకోలేదు అని మంత్రి అధికారులను ప్రశ్నించారు.. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని ఆదేశించారు..

ఆదోని మండలం సంబగల్లు గ్రామంలో మురుగు కాలువలు వెళ్తున్న లైన్ లోనే త్రాగు నీటి పైప్ లైన్ కూడా కలిసి ఉందనే విషయాన్ని ఆదోని ఎమ్మెల్యే లేవనెత్తిన అంశంపై మంత్రి స్పందిస్తూ.. మురుగు కాలువలు వెళ్తున్న లైన్ లోనే త్రాగు నీరు పైప్ లైన్ కూడా కలిసి ఉండడం వల్ల డయేరియా లాంటి అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని… వచ్చే సమావేశం నాటికి ఈ విషయాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కడైనా ఉంటే వాటిని గుర్తించి, సరి చేయాలని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని ఆదేశించారు..ప్రజా ప్రతినిధులు చెప్పిన సమస్యలపై వెంటనే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement