Wednesday, October 30, 2024

5వ తేదీ నుంచి పాఠశాలల పున:ప్రారంభం.. పది సప్లిమెంటరీకి ఫీజు మినహాయింపు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాఠశాలలు ప్రకటించిన షెడ్యూల్‌ కన్నా ఒక రోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరాన్ని జూలై 4 నుంచి ప్రారంభిస్తామని సెలవులకు ముందే విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదో తేదీన పున:ప్రారంభం పాఠశాలలు కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన జూలై నాలుగో తేదీన ఉండటంతోనే ఒక రోజు ఆలస్యంగా పాఠశాలల పున:ప్రారంభం అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాని పర్యటనలో మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూలై ఐదో తేదీ నుంచి బడులు తెరుచుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఫీజు చెల్లించకుండానే హాల్‌ టికెట్లు..

రాష్ట్రంలో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం రావడంతో సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించనక్కర్లేదని, అందరికీ హాల్‌ టికెట్లు అందిస్తామని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 6 లక్షల 15 వేల 908 మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 67.26 శాతంతో 4 లక్షల 14 వేల 281 మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 33 శాతం మందికిపైగా పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో.. వారందరికీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నెల రోజుల్లోనే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సప్లిమెంటరీలో పాసైన వారిని కూడా రెగ్యులర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారితో సమానంగా గుర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించడం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయంగా తల్లిదండ్రులు చెబుతున్నారు.

శ్రీకాకుళంలో అమ్మఒడి విడుదల కార్యక్రమం..

- Advertisement -

పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా ప్రారంభించిన జగనన్న అమ్మఒడి ఈ నెల 27న అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ ‘ఆంధ్రప్రభ’కు తెలిపారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా జనవరిలో అమ్మఒడి కింద రూ. 15 వేల చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే కరోనా కారణంగా గత రెండేళ్లపాటు 75 శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధనకు మినహాయింపునిచ్చి నగదు జమ చేసింది. ఈ ఏడాది నుంచి 75 శాతం హాజరు నిబంధనను అమలు చేస్తూ జూన్‌లో అమ్మఒడిని జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామమూర్తి క్రీడా మైదానంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా అమ్మఒడి నిధుల విడుదల నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు అమ్మఒడిని వర్తింపజేస్తున్నారు. పథకం ప్రారంభించిన సమయంలో రూ. 15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించినా.. అనంతరం రూ. వెయ్యి చొప్పున తగ్గించి ఆ మొత్తాన్ని టాయ్‌లెట్‌ మెయింటనెన్స్‌ ఫండ్‌కు కేటాయించాలని నిర్ణయించారు.

ఈ ఏడాది మరో రూ. వెయ్యిని పాఠశాలల మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 5.58 లక్షల మందికిపైగా అమ్మఒడిని అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థుల్లో అమ్మఒడి అందాల్సిన వారు 6.27 లక్షల మందిగా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement