తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : టోకెన్ల పంపిణీలో తొక్కిసలాటకు గురై గాయపడిన భక్తుల హృదయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఈరోజు ఉపశమనం లభించింది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తుల తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడగా.. మరో 34మంది ఆసుపత్రిపాలైన విషయం తెలిసిందే.
ఘటన జరిగినప్పటి నుంచి ఫాలో అప్ చేస్తూ తగిన ఆదేశాలు ఇస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న స్వయంగా వచ్చి పలు రకాల చర్యలు తీసుకున్న విషయం విదితమే. అందులో భాగంగా గాయపడిన వారికి టీటీడీతో నగదు పరిహారం ఇప్పించడంతో పాటు వారి కోరిక మేరకు ఈరోజు వారికి వైకుంఠ ద్వార దర్శనం చేయించమని ఆదేశించారు. అటు తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) అధికారవర్గం, జిల్లా అధికార యంత్రాంగం ఈరోజు గాయపడి డిశ్చార్జ్ అయిన 36మందికి, వారితో వచ్చిన వారికి తిరుమలలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు.
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు వారి కోసం ప్రత్యేకంగా బస్సులు, కార్లు సిద్ధం చేసి వారి వారి ఊళ్లకు పంపించారు. ఆ సందర్బంగా తొక్కిసలాట బాధితులు అధికారులకు కృతజ్ఞతలు తెలియచేసి సంతృప్తిని వ్యక్తం చేసారు. ఆ విధంగా భగవంతుని దర్శనానికి వచ్చి తొక్కిసలాటకు గురై రెండురోజుల పాటు తీవ్ర ఆవేదనకు గురైన బాధితులు అధికారుల ఉపశమన చర్యలతో సంతృప్తి చెంది స్వస్థలాలకు బయలుదేరారు.