కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ఏపీ హైకోర్టులో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. . విజయవాడ సూర్యారావుపేటలో ఈ కేసు నమోదైంది. 2021 జూన్ లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి శ్రీకాకుళం జిల్లాలోని ఆయన నివాసం నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు సూర్యారావుపేట కోర్టు సెంటర్ కి లోకేశ్ వచ్చారు.
దీంతో, కోవిడ్ నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో విజయవాడ మొదటి అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి లోకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టి వేయాలని తన పిటిషన్ లో కోరారు. లోకేశ్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను వినిపించారు. వాదనలను విన్న హైకోర్టు కేసును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.