తిరుపతి ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంతో సస్పెన్షన్‌కు గురైన గిరీషపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
తిరుపతిలో 2021లో ఎంపీ ఉపఎన్నికలు జరిగిన సమయంలో… ఈఆర్వోగా ఉన్నారు అప్పటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీషా. ఆయన లాగిన్ నుంచి బోగస్ ఓట్లకు సంబంధించి ఎపిక్ కార్డులు వ్యవహారంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. సుమారు 35వేల దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ఈఆర్వో లాగిన్ నుంచి డౌన్ లోడ్ చేసినట్లు గుర్తించిన ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్ చేసింది. గిరీషాతోపాటు ప్రమేయం ఉన్న మరికొంత మందిపై కేసు నమోదు అయింది.
ఈ క్రమంలో 3 నెలల పాటు విచారణ అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఈఆర్వోగా చలామణి అవుతూ కమిషనర్ లాగిన్ నుంచి డౌన్ లోడ్ చేసినట్లు తేల్చారు. దీంతో పీఎస్ గిరీషా సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. విచారణ మాత్రం పెండింగ్‌లో ఉందని స్పష్టం చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించరాదని, ఎన్నికలకు సంబంధం లేని విభాగానికిల కేటాయించాలని తెలిపింది.